మోత్కూరు : అదుపుతప్పి కారు బోల్తా పడడంతో యువకుడు మృతిచెందాడు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ఘటన హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై చిట్యాల మండలం పిట్టంపల్లి ఎక్స్ రోడ్డు వద్ద బుధవారం జరిగింది. మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. మోత్కూరు మండలం దత్తప్పగూడెం గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యురాలు ఎలుగు పార్వతమ్మ, యాదయ్య దంపతుల కుమారుడు ఎలుగు సందీప్ (22) హైదరాబాద్‌లో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. బుధవారం ఉదయం సందీప్ తన ఇద్దరు స్నేహితులతో కలిసి కారులో హైదరాబాద్ నుంచి విజయవాడకు బయలుదేరారు. మార్గమధ్యలో చిట్యాల మండలం పిట్టంపల్లి ఎక్స్ రోడ్డు వద్దకు రాగానే కారు అదుపుతప్పి హైవే పక్కనే ఉన్న చెట్టును ఢీకొని బోల్తా పడింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అందులోనే చిక్కుకుపోవడంతో తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు గమనించి వారిని బయటకు తీశారు. వెనక సీటులో కూర్చున్న సందీప్ పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌లోని కామినేని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందినట్లు బంధువులు తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడిన మరో ఇద్దరు యువకులు చికిత్స పొందుతున్నట్లు తెలిసింది.
అప్పడు కుమార్తె.. ఇప్పుడు కుమారుడు
పార్వతమ్మ, యాదయ్య దంపతులకు ఒక కుమార్తె, కుమారుడు సంతానం కాగా.. సుమారు ఐదేళ్ల క్రితం కుమార్తె మృతిచెందింది. ఇప్పుడు రోడ్డు ప్రమాదంలో ఒక్కగానొక్క కుమారుడు సందీప్ కూడా మృతిచెందడంతో ఆ కుటుంబం శోక సముద్రంలో మునిగిపోయింది. ఈ ఘటనతో దత్తప్పగూడెం గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.
ఫ మరో ఇద్దరికి గాయాలు


