పాలకవీడు : రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్ డెడ్ అయిన యువకుడి అవయవాలు దానం చేసేందుకు అతడి కుటుంబ సభ్యులు ముందుకొచ్చి మరో నలుగురికి పునర్జర్మ కల్పించారు. వివరాలు.. పాలకవీడు మండలం జాన్‌పహాడ్ గ్రామానికి చెందిన మంద చైతన్య(35) ఈ నెల 12న ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా అదుపుతప్పి కిందపడిపోయాడు. అతడి తలకు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. సోమవారం చైతన్య బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు తెలిపారు. వైద్యుల కౌన్సెలింగ్‌తో చైతన్య అవయవాలను దానం చేసేందుకు కుటుంబ సభ్యులు ముందుకొచ్చారు. దీంతో వైద్యులు చైతన్య నుంచి గుండె, కాలేయం, రెండు కిడ్నీలను సేకరించి మరో నలుగురికి అమర్చారు. మంగళవారం గ్రామంలో చైతన్య అంత్యక్రియలు నిర్వహించారు.


