మిరప సాగుకు అనువైన సమయం ఇదే.. | - | Sakshi
Sakshi News home page

మిరప సాగుకు అనువైన సమయం ఇదే..

Jun 18 2026 1:59 AM | Updated on Jun 18 2026 1:59 AM

కలుపు యాజమాన్యం

విత్తనశుద్ధి..

పెద్దవూర: గతేడాది మిరపకు అధిక రేటు రావడంతో ఈసారి కూడా మిరప పంటను అధిక విస్తీర్ణంలో సాగు చేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. మిరప సాగు, యాజమాన్య పద్ధతుల గురించి పెద్దవూర క్లస్టర్‌ ఉద్యానవన శాఖ అధికారి మురళి వివరించారు.

అనువైన నేలలు..

మిరప సాగుకు ఉదజని సూచిక(పీహెచ్‌) 6 నుంచి 6.5 ఉన్న నేలలు అత్యంత అనుకూలం. వర్షాధారపు పంటకు నల్ల రేగడి నేలలు అనుకూలం. నీటి ఆధారపు పంటకు నల్ల నేలలు, చల్క నేలలు, ఇసుకతో కూడిన ఒండ్రు నేలలు, ఎర్రనేలలు అనుకూలం.

వాతావరణం, విత్తే సమయం..

మిరప పంట అన్నిరకాల వాతావరణ పరిస్థితులను తట్టుకోగలదు. అయితే 10 నుంచి 35 డిగ్రీల ఉష్ణోగ్రత అనుకూలం. ఎండు మిరప పంటను వానాకాలం సీజన్‌లో వేసుకోవడం మంచిది. పచ్చి మిరప పంటను సంవత్సరం పొడవునా సాగు చేసుకోవచ్చు. మిరప పంటను ఖరీఫ్‌ సీజన్‌లో జూలై, ఆగస్టు నెలల్లో, యాసంగిలో అక్టోబర్‌, నవంబర్‌ నెలలో సాగు చేసుకోవచ్చు.

నేల తయారీ..

పొలాన్ని వేసవిలో లోతుగా దున్ని, ఆఖరి దుక్కిలో ఎకరానికి 10 టన్నుల పశువుల ఎరువు, 20 కిలోల వేపపిండి, 150 కిలోల సింగిల్‌ సూపర్‌ ఫాస్పేట్‌ వేయాలి. అలాగే 90 కిలోల పశువుల ఎరువు, 10 కిలోల వేపపిండి, 2కిలోల ట్రైకోడెర్మా విరిడి శిలీంధ్రపు పొడిని కలిపి 10–15 రోజులు నీడలో ఉంచి శిలీంధ్రం వృద్ధి చెందిన తర్వాత ఆఖరి దుక్కిలో వేస్తే తెగుళ్ల నుంచి కాపాడవచ్చు. భూమిలో పోషకాల శాతాన్ని పెంచుకోవడానికి పంట వేసే ముందు పచ్చిరొట్ట లేదా మినుము పంటను వేసుకుని భూమిలో కలియదున్నాలి. 10–15 రోజుల తర్వాత కల్టివేటర్‌తో నేల మెత్తగా దుక్కి అయ్యేవరకు 1–3 సార్లు దున్నుకోవాలి.

విత్తన మోతాదు

మిరపను రెండు రకాల పద్ధతుల ద్వారా సాగు చేయవచ్చు. మిరప విత్తనాలను నేరుగా ప్రధాన పొలంలో విత్తడానికి అయితే ఎకరాకు 2.5 కిలోల విత్తనం సరిపోతుంది. అలా కాకుండా నారు పెంచుటకు విత్తన మోతాదు సూటి రకాలకు 650 గ్రాములు, హైబ్రిడ్‌ రకాలైతే 75 నుంచి 100 గ్రాముల విత్తనం సరిపోతుంది.

నారు పెంచే విధానం

● ఎత్తైన నారుమడి తయారీ : మిరప నారుమడికి సారవంతమైన ఒండ్రునేలలు, నీటి వసతి, ఒక మోస్తారు నీడ కలిగిన ప్రదేశాలు చాలా అనుకూలం. ఒక మీటరు వెడల్పు, 40 మీటర్ల పొడవు, 15 సెం.మీ. ఎత్తుగల మడిలో ఒక ఎకరంలో నాటడానికి అవసరమైన నారు పెంచుకోవచ్చు. నారు పెంచటానికి నేలకు కొంచెం ఎత్తులో మట్టిని బెడ్డుగా చేసుకోవాలి. నాలుగు మూలలు సమాన ఎత్తులో ఉండేలా చూసుకోవాలి. నారుమళ్లలో విత్తనాలను 5 నుంచి 8 సెం.మీ. మధ్యదూరం, 1.5 సెం,మీ లోతులో వరుసల్లో విత్తనాలను పలుచగా విత్తుకోవాలి. విత్తిన 9వ రోజు, 13వ రోజున లీటర్‌ నీటిలో 3 గ్రా. కాఫర్‌ ఆక్సీక్లోరైడ్‌ను కలిపిన ద్రావణంలో నారుమళ్లను తడపాలి.

● ప్రో ట్రేలలో నారు పెంచే విధానం : ఈ పద్ధతిలో ప్రతి విత్తనం సమానంగా, ఆరోగ్యంగా పెరిగి మొక్కలు సమానంగా ఉండి పంట ఒకేసారి కాపునకు వస్తుంది. దీనితో పాటు నారు ధృడంగా పెరగడంతో పాటు నారుకుళ్లు, వైరస్‌ తెగుళ్లను ఆశించే అవకాశం తక్కువగా ఉంటుంది. ఒక ఎకరా ప్రధాన పొలంలో నాటుటకు కావాల్సిన వారు 98 సెల్స్‌ కలిగిన 120 ట్రేలు సరిపోతాయి. ఒక్కో ప్రోట్రేసు నింపుటకు సుమారు 1.2 కిలోల కోకోపీట్‌ మిశ్రమం అవసరం. ఒక్కొక్క సెల్‌లో ఒక్క విత్తనం నాటుకుని తిరిగి కోకోపిట్‌తో కప్పుకోవాలి. 6 రోజుల తర్వాత మొక్క మొలకెత్తడం ప్రారంభమయ్యాక వీటిని ఎత్తైన బెడ్లలోకి మార్చుకోవాలి.

● మొక్కలను నాటుకునే విధానం..

● మొక్కలను నీటి వసతి నేలల్లో నాటుకునేప్పుడు 24–24 అంగుళాలు(ఇంచులు) లేదా 26–26 లేదా 28–28 అంగుళాల దూరంలో నేల స్వభావాన్ని బట్టి నాటుకోవాలి. మొక్కలు పెట్టడానికి తీసిన రంధ్రాలలో కొద్దిగా నీరు పోసి వేర్లు మడత పడకుండా జాగ్రత్తగా నాటుకోవాలి. డ్రిప్‌ పద్ధతిలో నాటుకునేటప్పడు మొక్కల మధ్య దూరం 30–45 అంగుళాలు అనువైనది.

కలుపు నివారణకు మొక్కలు నాటిన 20–25 రోజుల తర్వాత కలుపు గొర్రు లేదా గుంటుకలను ప్రతి 15–20 రోజులకు ఒక్కసారి దున్నాలి. ఎలా మొక్క నేల మోత్తాన్ని కప్పివేసేవరకు 4–5 సార్లు దున్నాలి. మొక్కలను నాటుకునే 1–2 రోజుల ముందు లీటర్‌ నీటిలో 1.5మిల్లీలీటర్ల పెండిమిథాలిన్‌ కలుపుకుని పిచికారీ చేసుకోవాలి. పంటలో కలుపు మొక్కలు ఉన్నట్లయితే మొక్కలు నాటిన 25 రోజుల తర్వాత ఎకరానికి 400–500 మిల్లీలీటర్ల కై ్వజాలోఫాస్‌ ఇథైల్‌ను మొక్కలపై పడకుండా జాగ్రత్తగా పిచికారీ చేసుకోవాలి.

మిరప విత్తనాలను మూడు రకాలుగా విత్తనశుద్ధి చేసుకోవచ్చు. వైరస్‌ తెగుళ్ల నివారణకు కిలో మిరప విత్తనానికి గాను 150 గ్రాముల ట్రై సోడియం ఆర్థోఫాస్పేట్‌ను ఒక లీటరు నీటిలో కరిగించి దీనిలో 15 నుంచి 20 నిమిషాల పాటు విత్తనాన్ని నానబెట్టి తర్వాత నీటిని తీసివేసి మంచి నీటితో శుభ్రంగా కడిగి విత్తనాలను నీడలో ఆరబెట్టుకోవాలి. రసం పీల్చు పురుగుల నివారణకు కిలో విత్తనానికి 8 గ్రాముల ఇమిడాక్లోప్రిడ్‌ను పట్టించాలి. దీనివలన విత్తిన 20–25 రోజుల వరకు రసం పీల్చు పురుగుల ఉధృతి ఉండదు. బ్యాక్టీరియా, బూజు తెగుళ్ల నివారణకు కిలో విత్తనానికి 3గ్రాముల మాంకోజెబ్‌ లేదా కాప్టాన్‌ మందును పట్టించాలి. చివరిగా అదే విత్తనాన్ని ట్రై కోడెర్మా విరిడి అనే శిలీంధ్రం పొడిని 5–10 గ్రాముల విత్తనానికి పట్టించి నారుమడిలో విత్తుకోవాలి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement