స్వర్ణగిరీశుడికి అష్టదళ పాదపద్మార్చన సేవ | - | Sakshi
Sakshi News home page

స్వర్ణగిరీశుడికి అష్టదళ పాదపద్మార్చన సేవ

Jun 18 2026 1:59 AM | Updated on Jun 18 2026 1:59 AM

భువనగిరి : పట్టణ శివారులోని స్వర్ణగిరి క్షేత్రంలో గల వేంకటేశ్వరస్వామి దేవాలయంలో బుధవారం 108 బంగారు అష్టదళ పద్మ పుష్పాలతో స్వామివారికి అష్టోత్తర శతనామాలతో అష్టదళ పాదపద్మార్చన సేవ నిర్వహించారు. అంతకుముందు ఆలయంలో సుప్రభాత సేవ, తోమాల సేవ, సహస్రనామార్చన, నిత్య కల్యాణోత్సవం, సాయంత్రం తిరువీధి ఉత్సవ సేవ నిర్వహించారు. ఆయా పూజా కార్యక్రమాల్లో అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.

విద్యుత్‌ తీగలు తగిలి నాలుగు గేదెలు మృతి

హుజూర్‌నగర్‌ : పొలంలో తెగి పడ్డ విద్యుత్‌ తీగలు తగిలి నాలుగు గేదెలు మృతి చెందాయి. ఈ ఘటన హుజూర్‌నగర్‌ మండలంలోని శ్రీనివాసపురం గ్రామంలో బుధవారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీనివాసపురం గ్రామానికి చెందిన పి. నరసింహారావు, ఎన్‌. ఏసుపాదం, ఏ. శ్రీదేవి, ఎస్‌. అనురాధకు చెందిన నాలుగు గేదెలు మేత కోసం గ్రామ సమీపంలోని పొలంలోకి వెళ్లాయి. ఈదురు గాలులకు పొలంలో తెగి పడ్డ విద్యుత్‌ తీగలు తగిలి నాలుగు గేదెలు మృతిచెందాయి. ఒక్కో గేదె విలువ రూ.70 వేల వరకు ఉంటుందని గ్రామస్తులు తెలిపారు. అధికారులు స్పందించి నష్టపరిహారం అందించాలని బాధిత రైతులు కోరుతున్నారు.

చికిత్స పొందుతూ

వ్యక్తి మృతి

నకిరేకల్‌ : భార్యాభర్తల పంచాయితీ పరిష్కరించే క్రమంలో పెద్ద మనుషులు చేయి చేసుకోవడంతో అస్వస్థతకు గురైన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతిచెందాడు. బుధవారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నకిరేకల్‌ మండలం పాలెం గ్రామానికి చెందిన గుండగోని కృష్ణయ్య(46)కు అతడి భార్య పార్వతి మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. సమస్యను పరిష్కరించేందుకు గాను మే 17న గ్రామ పెద్దమనుషుల దగ్గర పంచాయితీ పెట్టారు. పంచాయితీ పరిష్కరించే క్రమంలో కృష్ణయ్య తన భార్యతో కలిసి ఉండాలనే విషయంలో అతడిపై పెద్ద మనుషులు చేయి చేసుకుని ఘర్ణణ పడ్డారు. దీంతో కృష్టయ్య తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. అతడిని నల్లగొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. నెల రోజులుగా అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతిచెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు నకిరేకల్‌ సీఐ హరిబాబు తెలిపారు.

పోలీసు సిబ్బందిపై దాడి చేసిన వ్యక్తి అరెస్ట్‌

హాలియా : విధి నిర్వహణలో ఉన్న పోలీసు సిబ్బందిపై దాడి చేసిన వ్యక్తిని హాలియా పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఎస్‌ఐ సాయిప్రశాంత్‌ తెలిపిన వివరాల ప్రకారం.. హాలియా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని వీరయ్యనగర్‌(వీబీ నగర్‌) నుంచి బుధవారం గృహ హింస ఫిర్యాదు అందడంతో సంఘటనా స్థలానికి వెళ్లిన పోలీసు సిబ్బందిపై మద్యం మత్తులో ఉన్న తురక రాంబాబు అనే వ్యక్తి దాడి చేసి విధులకు ఆటంకం కల్గించాడు. ఈ దాడిలో ఓ హోంగార్డుకు స్వల్ప గాయాలయ్యాయి. హోంగార్డు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దాడి చేసిన రాంబాబును అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చినట్లు హాలియా ఎస్‌ఐ సాయిప్రశాంత్‌ తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement