ప్రభుత్వం దృష్టిపెట్టాలి
పనులు త్వరగా చేపట్టాలి
తుర్కపల్లి : తుర్కపల్లి మండల కేంద్రంలో ప్రతిపాదించిన గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ పనులు మూడేళ్లుగా ముందుకు కదలడం లేదు. పరిశ్రమల విస్తరణతో వేలాది మంది నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్న స్థానికుల ఆశలు అడియాసలవుతున్నాయి. ఎంతో ఆర్భాటంగా ప్రారంభమైన ఈ ప్రాజెక్టు ప్రస్తుతం పూర్తిగా నిలిచిపోవడంతో స్థానికుల్లో తీవ్ర నిరాశ నెలకొంది.
పూర్తయిన భూసేకరణ..
గత ప్రభుత్వ హయాంలో తుర్కపల్లి శివారులో ఈ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. దీనికోసం మొత్తం 100 ఎకరాల స్థలాన్ని నిర్ధారించారు. ఇందులో 76 మంది రైతుల నుంచి సుమారు 93 ఎకరాల భూమిని సేకరించారు. దీనికి అదనంగా మరో 7 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించారు. భూ నిర్వాసితులకు పరిహారం చెల్లింపు ప్రక్రియ దాదాపు పూర్తయింది. సుమారు 82 ఎకరాలకు గాను రూ.16.5 కోట్ల పరిహారం చెల్లించగా, మరో 11 ఎకరాలకు సంబంధించిన పరిహారం ఇంకా పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. భూసేకరణ పూర్తయి మూడేళ్లు గడుస్తున్నా.. ప్రాజెక్టు స్థలంలో కనీస అభివృద్ధి పనులు ప్రారంభం కాలేదు. ఒక ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు ప్రధానంగా కావాల్సిన రోడ్ల నిర్మాణం, విద్యుత్ సరఫరా, తాగునీటి సదుపాయం, అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ వంటి కనీస వసతుల కల్పనకు అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. పనులు ఎక్కడికక్కడే నిలిచిపోవడంతో ప్రాజెక్టు భవితవ్యంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అందుబాటులోకి వస్తే..
గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ అందుబాటులోకి వస్తే తుర్కపల్లితోపాటు రాజాపేట, బొమ్మలరామారం, జగదేవపూర్, ఆలేరు మండలాలకు చెందిన యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఏర్పడటం ద్వారా ప్రాంతీయంగా ఆర్థికాభివృద్ధికి ఊతం కలగడమేగాక, వ్యాపార, రవాణా రంగాలు ఎంతో అభివృద్ధి చెందుతాయి.
కాగితాలకే పరిమితమా..?
భూసేకరణ పూర్తయి వంద ఎకరాల స్థలం అందుబాటులో ఉన్నప్పటికీ.. ప్రాజెక్టు పనులు చేపట్టకపోవడంపై స్థానికంగా చర్చనీయాంశమైంది. కాగితాలకే పరిమితమైన ఈ ప్రాజెక్టు మళ్లీ పట్టాలెక్కుతుందా లేదా అన్న ఆందోళన ప్రజల్లో నెలకొంది. ప్రభుత్వం తక్షణమే స్పందించి, నిలిచిపోయిన గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ పనులను ప్రారంభించాలని కోరుతున్నారు.
కలగానే గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్
ఫ నేటికీ ప్రారంభంకాని పనులు
ఫ ఆశతో ఎదురుచూస్తున్న యువత
ఫ ప్రభుత్వం చొరవ చూపాలని విజ్ఞప్తి
ఇండస్ట్రియల్ పార్క్ పూర్తయితే ఎంతోమంది నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది. పనులు నిలిచిపోవడంతో ప్రజల్లో అనుమానాలు పెరుగుతున్నాయి. ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి వెంటనే ఇండస్ట్రియల్ పార్క్ పనులు ప్రారంభించాలని కోరుతున్నాం.
– ఎలుగుల భాను, తుర్కపల్లి
ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు భూ సేకరణ పూర్తికావడంతో త్వరలోనే పరిశ్రమలు వస్తాయని అశించాం. మూడేళ్లయినా పనులు ప్రారంభమవుతాయని ఎదురుచూస్తున్నాం. ప్రభుత్వం ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేయాలి.
– కందుకూరి వేణు


