ఫ నేడు బీబీనగర్, రాజాపేట మినహా అన్ని మండలాల్లో అందుబాటులో యాప్
భువనగిరి: వానాకాలం సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా యూరియాను అందుబాటులో ఉంచేందుకు వ్యవసాయ శాఖ ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా జిల్లాలో బుధవారం ఫర్టిలైజర్ యాప్‌ను ప్రారంభించారు. ఈ యాప్ ముందుగా భువనగిరి, యాదగిరిగుట్ట, మోత్కూర్ మండలాల్లో అందుబాటులోకి రాగా గురువారం బీబీనగర్, రాజాపేట మండలాలు మినహా అన్ని మండలాలలో అందుబాటులోకి రానుంది. జిల్లాలో వానాకాలం సీజన్‌కు 5.50 లక్షల బస్తాల యూరియా అవసరం ఉండగా ప్రస్తుతం 2.50 లక్షల బస్తాలు అందుబాటులో ఉన్నట్లు డీఏఓ పీవీ రమణారెడ్డి తెలిపారు.
లోక్ అదాలత్‌ను విజయవంతం చేయాలి
భువనగిరిటౌన్ : ఈనెల 20న నిర్వహించే జాతీయ లోక్‌అదాలత్‌ను విజయవంతం చేయాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి వి. మాధవీ లత కోరారు. బుధవారం భువనగిరి పట్టణంలోని న్యాయసేవాధికార సంస్థ కార్యాలయంలో అన్ని కోర్టుల కానిస్టేబుల్స్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్స్‌తో లోక్‌అదాలత్‌పై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. మారుమూల ప్రాంత ప్రజలకు తెలిసేలా లోక్ అదాలత్‌పై విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. రాజీ పడదగిన కేసులను గరిష్ట సంఖ్యలో పరిష్కరించాలన్నారు. కోర్టుల చుట్టూ తిరిగే శ్రమ లేకుండా, సమయం, డబ్బు ఆదా చేసుకోవడానికి లోక్ అదాలత్ ఒక సువర్ణ అవకాశమని, కక్షిదారులు తమ వివాదాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని ఆమె కోరారు.
మరింత సమర్థంగా కమ్యూనిటీ పోలీసింగ్
బొమ్మలరామారం: కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమాలు మరింత సమర్థంగా నిర్వహించాలని జిల్లా ఎస్పీ అక్షాంశ్ యాదవ్ ఆదేశించారు. బొమ్మలరామారం పోలీస్ స్టేషన్‌ను బుధవారం ఆయన తనిఖీ చేసి రికార్డులు పరిశీలించి మాట్లాడారు. విధి నిర్వహణలో, ఫిర్యాదుల స్వీకరణలో ప్రజలతో మర్యాద పూర్వక వైఖరి అవలంబిస్తూ పారదర్శకతతో వేగంగా కేసులను దర్యాప్తు చేయాలన్నారు. నేర నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షించడానికి రాత్రి సమయాలలో గస్తీముమ్మరం చేయాలని ఆదేశించారు. ఆయన వెంట ఎస్‌ఐ బుగ్గ శ్రీశైలం, సిబ్బంది ఉన్నారు.
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
రాజాపేట : అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని హౌసింగ్ పీడీ లక్క అలివేలు హామీ ఇచ్చారు. రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక కోసం రాజాపేట మండలం నెమిల గ్రామంలో గుడిసెలు, పేదల ఇళ్లను బుధవారం హౌసింగ్ పీడీ పరిశీలించారు. ఈ సందర్భంగా వారి స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడారు. కార్యక్రమంలో సర్పంచ్ పులి రాజు, ఉప సర్పంచ్ మార్క శివకుమార్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ సిలివేరు బాలరాజు గౌడ్, హౌసింగ్ ఏఈ వేముల వివేక్, గ్రామ పంచాయతీ కార్యదర్శి ఎండీ జలీల్, నాయకుడు మాయకోటి రాజు పాల్గొన్నారు.


