భువనగిరిటౌన్ : నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించి, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్) నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ కందాడి మణిపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం ఆ పార్టీ ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ భాస్కర్‌రావును కలిసి వినతిపత్రం అందజేశారు. అంతకు ముందు పట్టణంలో భిక్షాటన చేసి నిరసన తెలిపారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా నాయకులు అంతకుముందు భిక్షాటన కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు గంపల విజయ్ కుమార్, నాయకులు ఉపేందర్, శ్రీనివాస్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
యువతకు శాపంగా సీఎం రేవంత్‌రెడ్డి పాలన
యాదగిరిగుట్ట: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాలన రాష్ట్రంలోని యువతకు శాపంగా మారిందని తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్) ఆలేరు నియోజకవర్గ ఇన్‌చార్జి కందాడి మణిపాల్‌రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో నిరుద్యోగుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తూ సోమవారం యాదగిరిగుట్ట పట్టణంలో టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో నిరుద్యోగుల భిక్షాటన కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టణంలోని వైకుంఠద్వారం నుంచి గుండ్లపల్లి వరకు పలు దుకాణాల వద్ద వారు భిక్షాటన చేసి వినూత్నంగా నిరసన తెలిపారు. కార్యక్రమంలో విజయ్, ఉపేందర్, శ్రీనివాస్, రాజు, భాగ్యలక్ష్మి, సందీప్, మమత, మౌనిక, రాజలక్ష్మి పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు.


