రైతుల గోడు పట్టించుకోని పాలకులు | - | Sakshi
Sakshi News home page

రైతుల గోడు పట్టించుకోని పాలకులు

Jun 16 2026 1:34 AM | Updated on Jun 16 2026 1:34 AM

రామన్నపేట : ధాన్యం కొనుగోళ్ల విషయంలో రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తూ.. రైతుల గోడు పట్టించుకోవడం లేదని నకిరేకల్‌ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆరోపించారు. సోమవారం రామన్నపేట మండలంలోని పల్లివాడ, దుబ్బాక గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన సందర్శించారు. రైతులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్రాలలో ధాన్యం పోసి మూడు నెలలు కావొస్తున్నా కొనుగోళ్లు జరుగక రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతులను కంటికి రెప్పలా కాపాడుకుందని, సకాలంలో ధాన్యం కొనుగోలు చేసి డబ్బులు చెల్లించిందని, రైతుబంధు, నాణ్యమైన కరెంట్‌ అందించిందని వివరించారు. వానాకాలం సీజన్‌ ప్రారంభమై నాట్లు వేసే సమయం వస్తున్నా ధాన్యం కొనుగోళ్లు పూర్తికాకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. రేవంత్‌రెడ్డి పాలన పట్ల అన్నివర్గాల ప్రజలు అసంతృప్తితో ఉన్నారని, కేసీఆర్‌ పాలనను తిరిగి కోరుకుంటున్నారని అన్నారు. ఆయన వెంట బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పోచబోయిన మల్లేశం, సర్పంచులు శ్రీనివాసులు, గర్దాసు విక్రం, రాములు, సుధీర్‌బాబు, గాదె పారిజాత, వెంకటేశం ఉన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement