మూతబడిన స్కూళ్లను తెరిపిస్తాం | - | Sakshi
Sakshi News home page

మూతబడిన స్కూళ్లను తెరిపిస్తాం

Jun 16 2026 1:34 AM | Updated on Jun 16 2026 1:34 AM

కార్పొరేట్‌కు దీటుగా సదుపాయాలు బడికి దూరంగా ఉన్నవారిని గుర్తిస్తాం బడిబాట ద్వారా 8వేల మంది విద్యార్థులను చేర్పించడమే లక్ష్యం యూనిఫాం కలర్‌ మారింది 10లోపు స్థానం ఉండేలా కృషి సన్నబియ్యంతో నాణ్యమైన భోజనం 62 ప్రీ ప్రైమరీ పాఠశాలలు ఏర్పాటు

కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ బడులు

బడిబాట ద్వారా 800మందిని చేర్పించాం

డీఈఓ భిక్షపతి

ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని సదుపాయాలను ప్రభుత్వం కల్పించింది. కార్పొరేట్‌కు దీటుగా నాణ్యమైన విద్య అందిస్తున్నాం. మంచి నీరు, మరుగుదొడ్లు, విశాలమైన మైదానాలు ఉన్నాయి. ఇంకా ఏయే పాఠశాలల్లో సౌకర్యాలు అవసరమో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ద్వారా తెలుకున్నాం. వాటి కల్పనకు చర్యలు తీసుకుంటాం.

భువనగిరి: జిల్లాను విద్యాభివృద్ధిలో ముందంజలో ఉంచేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించి, అందుకు అనుగుణంగా కృషి చేస్తామని డీఈఓ బోల్లారం భిక్షపతి అన్నారు. పాఠశాలలు పునఃప్రారంభమైన నేపథ్యంలో జిల్లాలో విద్యారంగ అభివృద్ధికి తీసుకునే చర్యలను సోమవారం ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వెల్లడించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. పాఠశాలలు ప్రారంభమైన తొలి రోజు పాఠ్యపుస్తకాలతో పాటు నోటు బుక్స్‌ అందజేశాం. విద్యార్థులకు సరిపడా పుస్తకాలు వచ్చాయి.

జిల్లాలో విద్యార్థులు లేక 62 పాఠశాలలు మూతబడ్డాయి. 2026–27 విద్యా సంవత్సరానికి మూతబడిన స్కూళ్లను తెరిపించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇందుకోసం స్థానికంగా ఉన్న ప్రధానోపాధ్యాయులు, అమ్మ ఆదర్శ కమిటీల చైర్మన్లు, ప్రజాప్రతినిధుల సహకారంతీసుకొని తల్లిదండ్రులతో మాట్లాడుతాం. ప్రతి పాఠశాలలో కనీసం 10 నుంచి 15 మంది విద్యార్థులుండేలా చూస్తాం. ఇందుకోసం 5 ఏళ్ల వయస్సు పైబడిన వారు, బడికి దూరంగా ఉన్న వారిని గుర్తిస్తాం. బడిలో చేర్పించి సరిపడా ఉపాధ్యాయులను అందుబాటులో

ఉంచుతాం.

బడిబాట కార్యక్రమం జిల్లాలో కొనసాగుతోంది. గత సంవత్సరం జిల్లాలో 701 ప్రభుత్వ పాఠశాలల్లో 35,594 మంది విద్యార్థులున్నారు. ఈ విద్యాసంవత్సరంలో 10 శాతం నమోదు పెంపుతో 8వేల మందిని బడిలో చేర్పించాలని పాఠశాల విద్యాశాఖ ల క్ష్యాన్ని నిర్దేశించింది. దీనికోసం గత ఫిబ్రవరి, మార్చి నుంచే బడిబాట నిర్వహిస్తున్నాం. ఇప్పటి వరకు సుమారు 800 మంది విద్యార్థులను చేర్పించాం.

ఈ విద్యా సంవత్సరానికి యూనిఫాం కలర్‌ మారింది. గతంలో రెడ్‌ , యాష్‌కలర్‌ ఉండగా ఈసారి నెవీ బ్లూ కలర్‌తో కూడిన యూనిఫాం అందజేస్తాంరు. వస్త్రం రాగానే యూనిఫాం కుట్టే వారికి అందజేసి వూర్తి కాగానే విద్యార్థులకు ఇస్తాం. ఇప్పటికే విద్యార్థుల వద్ద కొలతలు తీసుకున్నారు.

పదో తరగతి ఫలితాల్లో 2024–25లో రాష్ట్రంలో జిల్లా 8వ స్థానంలో ఉండగా 2025–26లో 12వ స్థానం వచ్చింది. 2026–27లో రాష్ట్రంలో 10వ స్థానం లోపు ఉండేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తాం. మొదటి నుంచే ప్రత్యేక తరగతులు నిర్వహించేలా చర్యలు తీసుకుంటాం. వెనుకబడిన విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ పెడుతాం. సబ్జెక్టు అర్థమయ్యేలా టీచర్లు బోధించేలా చూస్తాం.

ప్రభుత్వ పాఠశాలల్లో సన్నబియ్యంతో నాణ్యమైన భోజనంతో పాటు పోషకాహారం అందిస్తాం. వారానికి మూడు రోజుల పాటు రాగి జావ ఇస్తారు. ఈ విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు అల్పాహారం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రోజూ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పాఠశాలలను విజిట్‌ చేస్తా. మధ్యాహ్న భోజనం, విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు, నాణ్యమైన బోధనపై తనిఖీలు నిర్వహిస్తా. ఉపాధ్యాయులు విధుల నిర్వహణలో, మధ్యాహ్న భోజనం విషయంలో నిర్లక్ష్యంవహిస్తే చర్యలు తీసుకుంటాం.

జిల్లాలో ఈ విద్యాసంవత్సరానికి 62 ప్రీప్రైమరీ పాఠశాలలు మంజూయ్యాయి. ఆయా పాఠశాలల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే బోధకులు, ఆయా పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement