రెడ్‌క్రాస్‌ సేవలు అభినందనీయం | - | Sakshi
Sakshi News home page

రెడ్‌క్రాస్‌ సేవలు అభినందనీయం

Jun 15 2026 7:40 AM | Updated on Jun 15 2026 7:40 AM

మోత్కూరు : ప్రపంచ రక్త దాతల దినోత్సవం సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లోని రాజభవన్‌లో రెడ్‌ క్రాస్‌ రాష్ట్ర స్థాయి అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన రక్త దాన శిబిరాల్లో రక్తదాతలను ప్రోత్సహించడంలో, రక్త దాన శిబిరాలు నిర్వహించడంలో ముందు నిలిచిన డాక్టర్‌ చెల్లా జయశ్రీ, పోలీసు సంస్థ ఆధ్వర్యంలో అత్యధిక రక్త దాన శిబిరాలు నిర్వహించిన అడిషనల్‌ ఎస్పీ బి.వినోద్‌కుమార్‌లకు గవర్నర్‌ శివ ప్రతాప్‌ శుక్లా అవార్డులు అందజేశారు. రక్త దానాలను ప్రోత్సహించి ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటున్నందుకు జిల్లా రెడ్‌ క్రాస్‌ సంస్థ సేవలను గవర్నర్‌ అభినందించారు. కార్యక్రమంలో రెడ్‌క్రాస్‌ రాష్ట్ర చైర్మన్‌ దాన కిషోర్‌, పోలీస్‌ ఉన్నతాధికారి మహేష్‌ భగవత్‌, జనరల్‌ సెక్రెటరీ శ్రీరాములు, ట్రెజరర్‌ శ్రీనివాస్‌రెడ్డి, రెడ్‌క్రాస్‌ జిల్లా చైర్మన్‌ డాక్టర్‌ లక్ష్మినర్సింహారెడ్డి, వైస్‌ చైర్మన్‌ బాలాజీ, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రావుల మహేందర్‌రెడ్డి, డివిజన్‌ చైర్మన్‌ సద్ది వెంకటరెడ్డి, జిల్లా డైరెక్టర్‌ పన్నాల శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

భూమి శిస్తు తెస్తే కాంగ్రెస్‌కు పుట్టగతులు ఉండవు

భూదాన్‌పోచంపల్లి : రాష్ట్రంలో మళ్లీ భూమి శిస్తు తెస్తే కాంగ్రెస్‌కు పుట్టగతులు ఉండవని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్‌ అన్నారు. ఆదివారం భూదాన్‌పోచంపల్లిలోని సీపీఎం కార్యాలయంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. భూమికి రకం వసూలు చేస్తామని ఇటీవల మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఖమ్మం పర్యటనలో ప్రకటించారని, తెలంగాణలో మళ్లీ పటేల్‌, పట్వారీ వ్యవస్థను తీసుకొస్తే సహించేది లేదని హెచ్చరించారు. ప్రభుత్వం వెంటనే తమ నిర్ణయాన్ని విరమించుకోకపోతే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్నారు. సమావేశంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు కొండమడుగు నర్సింహ, మాజీ డివిజన్‌ కార్యదర్శి గూడురు అంజిరెడ్డి, మండల కార్యదర్శి కోట రాంచంద్రారెడ్డి, కార్యదర్శివర్గ సభ్యుడు మంచాల మధు, పట్టణ కార్యదర్శి దుబ్బాక జగన్‌ తదితరులు పాల్గొన్నారు.

దుకాణ సముదాయాలకు బహిరంగ వేలం

వలిగొండ : మండలంలోని వెంకటాపురంలో గల మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ఆవరణలో దుకాణ సముదాయాలకు 2026 – 27 సంవత్సరానికిగాను అమ్ముకునేందుకు ఈ నెల 18న మధ్యాహ్నం 12 గంటలకు షీల్డ్‌ టెండర్‌, బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి మోహన్‌ బాబు ఆదివారం తెలిపారు. ఆసక్తి ఉన్న వారు ఆలయ కార్యాలయంలో సకాలంలో పాల్గొనాలని పేర్కొన్నారు.

సీఎం కనగల్‌ పర్యటన వాయిదా

కనగల్‌ : సీఎం రేవంత్‌రెడ్డి కనగల్‌ మండల పర్యటన వాయిదా పడిందని నల్లగొండ జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌ తెలిపారు. ఆదివారం ఆయన కనగల్‌ వద్ద సభా స్థలాన్ని ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ శ్రీధర్‌రెడ్డితో కలిసి పరిశీలించి మాట్లాడారు. ఈ నెల 17న జరగాల్సిన బహిరంగ సభను వాయిదా వేశారని.. త్వరలో మరో తేదీ ఖరారవుతుందని పేర్కొన్నారు. వర్షాలు కురుస్తుండడంతో బహిరంగ సభ స్థలంలో నల్లరేగడి భూమి చిత్తడిగా మారిందన్నారు. పెద్ద టెంట్లు నిలబడడం లేదని, వాతావరణ పరిస్థితుల అనుకూలంగా లేని కారణంగానే వాయిదా వేశామని తెలిపారు. త్వరలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సూచనల మేరకు ముఖ్యమంత్రి పర్యటన తేదీ ఖరారు చేస్తామన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement