నగరాభివృద్ధి పనుల టెండర్లు కొన్ని సాంకేతిక కారణాలతో రద్దు అయ్యాయి. ప్రస్తుతం టెండర్ల ప్రక్రియ కొనసాగుతోంది. త్వరలోనే ప్రక్రియను పూర్తి చేసి పట్టణంలో అభివృద్ధి పనులను మొదలు పెట్టేలా చూస్తాం.
– శ్రీనివాస్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్, ఆలేరు
ఆలేరు: ఆలేరు మున్సిపాలిటీలో కోట్లాది నిధుల నగరాభివృద్ధి టెండర్ల వ్యవహారం కొలిక్కి రావడం లేదు. వరుసగా రెండు సార్లు టెండర్లు రద్దు కావడం సాంకేతిక లోపమా? లేక రాజకీయ జోక్యమా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. దీంతో పట్టణాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంజూరు చేసిన రూ.15కోట్ల నగరాభివృద్ధి నిధులకు గ్రహణం వీడటం లేదు. ఈ నిధులు మంజూరై ఆరు నెలలు గడుస్తున్నా అభివృద్ధి పనులు టెండర్ల దశ దాటకపోవడం గమనార్హం. అధికారుల అలసత్వం కారణంగా కోట్లాది రూపాయల పట్టణ ప్రగతికి బ్రేకులు పడుతున్నాయి. దీంతో ఎన్నో ఏళ్లుగా వేధిస్తున్న రోడ్లు, వరద కాల్వలు తదితర సమస్యలు తీరుతాయనే పట్టణ వాసుల ఆశలు టెండర్ల జాప్యంతో నీరుగారుతున్నాయి.
చేపట్టాల్సిన పనులు
రూ.9కోట్లతో పట్టణంలోని వివిధ వార్డుల్లో వరద కాల్వలు, రూ.4కోట్లతో సీసీ రోడ్లు, బృందావన్‌కాలనీలో రూ.కోటితో పార్కు, రూ.75లక్షలతో పర్రె కాల్వ వద్ద కల్వర్టు, రూ.25లక్షలతో ఆలేరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల గ్రౌండ్‌లో ఓపెన్ జిమ్ పనులు చేపట్టాల్సి ఉంది.
రద్దుకు కారణాలు..
ఈ ఏడాది జనవరి 13వ తేదీన ఆన్‌లైన్‌లో టెండర్లను ఆహ్వానించారు. మున్సిపల్ ఎన్నికల కోడ్ కారణంగా అదే నెల 21న అధికారులు రద్దు చేశారు. తర్వాత అదే ఏడాది ఏప్రిల్ 10న అధికారులు రెండోసారి టెండర్ల ప్రక్రియను ప్రారంభించి, ఈనెల1న రద్దు చేశారు. తెలుగు దినపత్రికల్లో మాత్రమే టెండర్ నోటిఫికేషన్ ప్రకటన ఇచ్చారని, ఆంగ్ల పత్రికలో ప్రచురించలేదనే సాంకేతిక కారణంతో టెండర్లను మళ్లీ రద్దు చేశారు. ఈక్రమంలో ఈనెల 6న మూడోసారి టెండర్ల ప్రక్రియ ప్రారంభించారు. ఈసారైనా టెండర్లను విజయవంతంగా పూర్తి చేసి, అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతారా లేక కొత్త కారణం తెరపైకి తెచ్చి మళ్లీ రద్దు చేస్తారా అని చర్చనీయాంశంగా మారింది.
తెర వెనుక మంత్రాంగం..
టెండర్లు రద్దు కావడం యాదృచ్ఛికమా? లేక పక్కా ప్రణాళికతో జరుగుతోందా? అనే అనుమానాలను కలిగిస్తోంది. జిల్లాకు చెందిన ఓ ప్రజాప్రతినిధి తనకు అనుకూలమైన కాంట్రాక్టర్లకు కోట్లాది రూపాయల పనులు దక్కేలా తెర వెనుక మంత్రాంగం నడుపుతుండడంతో ఏదో ఒక సాకుతో రెండుసార్లు టెండర్ల రద్దుకు కారణమని ప్రచారం జరుగుతోంది.
ఫ సీఎం నిధులు మంజూరై ఆరు నెలలైనా మారని మున్సిపాలిటీ రూపురేఖలు
ఫ రెండుసార్లు రద్దయిన ఆలేరు
నగరాభివృద్ధి టెండర్లు
ఫ మూడోసారైనా అభివృద్ధి
పనులకు మోక్షం కలిగేనా..


