నల్లగొండ టౌన్ : రైతుల ఐక్యత, పరస్పర సహకారం, ప్రభుత్వ మద్దతుతో నల్లగొండ జిల్లాను బత్తాయి సాగులో దేశానికే ఆదర్శంగా నిలిపేందుకు కృషి చేస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. శనివారం నల్లగొండలోని ఎలిమినేటి మాధవరెడ్డి పోలీస్ ఆడిటోరియంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి సిట్రస్ సెమినార్‌కు మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. నల్లగొండ పేరు వినగానే బత్తాయి గుర్తుకొస్తుందని, జిల్లాలో గతంలో 4 లక్షల ఎకరాల బత్తాయి సాగు కాగా, కాలక్రమేనా వివిధ కారణాల వల్ల అది 40 వేల ఎకరాలకు తగ్గడం బాధాకరమన్నారు. అయితే మారుతున్న పరిస్థితులకు అనుకూలంగా రైతులు కూడా మారాల్సిన అవసరం ఉందన్నారు. ఎప్పుడు వరి పైనే ఆధారపడకుండా బత్తాయి లాంటి పంటలు, ఇతర ఉద్యాన పంటలను సాగు చేయాలన్నారు. పంట మార్పిడిపై తప్పనిసరిగా దృష్టి సారించాలన్నారు. ఈ విషయంలో రైతులకు ప్రభుత్వ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వివిధ పంటలు సాగుచేసే రైతులకు సహకారం అందిస్తున్నదని, ముఖ్యంగా వరి పండించిన రైతులకు మద్దతు ధర కల్పించడమే కాకుండా, రూ.500 బోనస్ ఇచ్చి సన్నధాన్యాన్ని కొనుగోలు చేస్తుందన్నారు. ఉద్యాన పంటల ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకొని ఇటీవల ముఖ్యమంత్రి అంతర్జాతీయ స్థాయి ఫ్రూట్ మార్కెట్ కు శంకుస్థాపన చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అవసరమైతే హైదరాబాద్‌లో మరోసారి సమావేశం ఏర్పాటు చేసి సిట్రస్‌ను ఏవిధంగా ముందుకు తీసుకెళ్లాలో సిట్రస్ రైతుల సమస్యలు, భవిష్యత్తు అవకాశాలు, ఆధునిక సాగు పద్ధతులు, మార్కెటింగ్ ఎగుమతులు తదితర విషయాలపై ఆలోచిస్తామన్నారు. పరిగి ఎమ్మెల్యే రాంమోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. బత్తాయిలో అనేక కొత్త రకం వంగడాలు వచ్చాయని, రైతులకు ఇవి ప్రయోజనకరంగా ఉంటాయన్నారు. అనంతరం రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ బుర్రి చైతన్య, రాష్ట్ర డెయిరీ డెవలప్‌మెంట్ చైర్మన్ అమిత్‌రెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యాన యూనివర్సిటీ వైస్ చాన్సలర్ డి. రాజిరెడ్డి, రైతు కమిషన్ సభ్యులు రాంరెడ్డి, చెవిటి వెంకన్న, పావనిరెడ్డి, ఉద్యాన శాఖ రాష్ట్రస్థాయి అధికారులు, జిల్లాల అధికారులు, రైతులు పాల్గొన్నారు. అనంతరం మంత్రి ఆడిటోరియం ఆవరణలో ఏర్పాటు చేసిన వివిధ రకాల స్టాళ్లను ప్రారంభించి పరిశీలించారు.
మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి


