వృద్ధురాలిని హత్య చేసిన నిందితుడి అరెస్టు | - | Sakshi
Sakshi News home page

వృద్ధురాలిని హత్య చేసిన నిందితుడి అరెస్టు

May 7 2026 9:50 AM | Updated on May 7 2026 9:50 AM

నార్కట్‌పల్లి : రెండేళ్ల క్రితం వృద్ధురాలిని హత్య చేసిన నిందితుడిని అరెస్టు చేసినట్లు నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి తెలిపారు. నార్కట్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌లో బుధవారం ఆయన వివరాలు వెల్లడించారు. నార్కట్‌పల్లి మండలం బ్రాహ్మణవెల్లెంలకు చెందిన రెబ్బ జానకమ్మ(72) ఇంట్లో ఉండగా 2024 ఆగస్టు 2న అర్ధరాత్రి అదే గ్రామానికి చెందిన కొలను కార్తీక్‌ ఇంట్లోకి ప్రవేశించి జానకమ్మ గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం ఆమె ఒంటిపై ఉన్న బంగారం దోచుకుని వెళ్లిపోయాడు. మృతురాలి కుమారుడు యాదగిరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నార్కట్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేయగా.. డీఎస్పీ శివరాంరెడ్డి ఆధ్వర్యంలో నార్కట్‌పల్లి సీఐ నాగరాజు, ఎస్‌ఐ విష్ణుమూర్తి, పోలీసు సిబ్బంది విచారణ చేపట్టారు. బుధవారం నిందితుడు కార్తీక్‌ను నార్కట్‌పల్లి శివారులోని మునుగోడు రోడ్డు ఫ్లైఓవర్‌ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా.. జానకమ్మ వద్ద తాను రూ.1.18లక్షలు అప్పు తీసుకున్నానని, ఆ డబ్బులు తిరిగి ఇవ్వమని జానకమ్మ ఒత్తిడి చేస్తుండటంతో హత్య చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడని డీఎస్పీ తెలిపారు. కార్తీక్‌ విజయవాడలోని ఓ హోటల్‌లో సప్లయర్‌గా పనిచేస్తున్నాడని, అతడు దొంగిలించిన ఆభరణాలను రూ.3.50లక్షలకు సికింద్రాబాద్‌లో ఓ వ్యక్తికి అమ్మి, ఆ డబ్బును జల్సాలకు ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు నిందితుడిని అరెస్టు చేసి బైక్‌ స్వాధీనం చేసుకున్నామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement