యాదగిరి క్షేత్రంలో శాస్త్రోక్త పూజలు | - | Sakshi
Sakshi News home page

యాదగిరి క్షేత్రంలో శాస్త్రోక్త పూజలు

Apr 19 2026 8:29 AM | Updated on Apr 19 2026 8:29 AM

యాదగిరిగుట్ట : శ్రీయాదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో శనివారం ఆర్జిత పూజలు శాస్త్రోక్తంగా కొనసాగాయి. వేకువజామునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు శ్రీస్వామి వారికి సుప్రభాతం, అభిషేకం, బాలభోగం, ఆరాధన, సహస్ర నామార్చనలు జరిపించారు. ఇక ముఖ మండపంలో ఉత్సవమూర్తులకు సువర్ణ పుష్పార్చన, అష్టోత్తర పూజలను నిర్వహించారు. ప్రథమ ప్రాకార మండపంలో ముందుగా శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, శ్రీస్వామి అమ్మవార్ల నిత్యకల్యాణం చేపట్టారు. సాయంత్రం వేళ భక్తుల నడుమ జోడు సేవలను మంగళవాయిద్యాల మధ్య ఊరేగించారు. ఆయా పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.

నాణ్యత ప్రమాణాల్లో రాజీపడొద్దు

బొమ్మలరామారం : విద్యార్థులకు అందించే ఆహారం నాణ్యతా ప్రమాణాల్లో రాజీ పడొద్దని సమగ్ర శిక్షా అభియాన్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ నవీన్‌ నికోలస్‌ అన్నారు. బొమ్మలరామారం మండలం మల్యాల గ్రామంలో గల కేజీవీబీని శనివారం ఆయన తనిఖీ చేశారు. విద్యాలయంలో మాడ్యులర్‌ కిచెన్‌ను పరిశీలించారు. పాఠశాలలో ఫ్యాకల్టీ వివరాలను అడిగి తెలుసుకున్నారు. మౌలిక వసతుల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వెంట డీఈఓ సత్యనారయణ, ఈఈ మధు సూదన్‌ రెడ్డి, జీసీడీఓ రాధ, ప్రత్యేక అధికారి సాయి లక్ష్మి ఉన్నారు.

సౌకర్యాలు కల్పించాలి

తుర్కపల్లి : పని ప్రదేశంలో ఉపాధి కూలీలకు తాగునీరు, నీడతోపాటు ఇతర మౌలిక సౌకర్యాలు కల్పించాలని డీఆర్‌డీఓ నాగిరెడ్డి అన్నారు. తుర్కపల్లి పంచాయతీ పరిధిలో జరుగుతున్న ఉపాధిహామీ పనులను శనివారం ఆయన పరిశీలించారు. కూలీలకు పలు సూచనలు చేశారు. ప్రస్తుతం ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున కూలీలు ఉదయం వేళల్లోనే పనికి హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఆయన వెంట ఎంపీడీఓ గీతారెడ్డి, గ్రామ కార్యదర్శి శైలజ, ఎప్‌ఏ చాంద్‌పాషా పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement