సాక్షి, యాదాద్రి : జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ కేంద్రాల వారీగా ఓటర జాబితాలు సిద్ధం చేయాలని శుక్రవారం కలెక్టర్‌లకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో జిల్లా యంత్రాంగం ఓటర్ల జాబితాలో అదనపు ఓటర్ల మ్యాపింగ్ పూర్తిచేసే పనిలో నిమగ్నమైంది. అయితే జిల్లాలోని భువనగిరి, చౌటుప్పల్ రెవెన్యూ డివిజన్‌ల పరిధిలోని 17 మండలాల్లో 17 జెడ్పీటీసీ, 178 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి.
కొత్త ఓటర్లతో జాబితాలు తయారీ
అదనపు ఓట్లను కలుపుకుని పోలింగ్‌కేంద్రాల వారీగా కొత్త ఓటర్ల జాబితాను తయారు చేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈనెల 23వ తేదీలోగా ఆయా పోలింగ్ బూత్‌లలో నమోదు చేస్తారు. శాసనసభ ఎన్నికల ఓటరు జాబితాతోనే పంచాయతీ ఎన్నికలను నిర్వహించారు. గత జూలై తర్వాత నమోదైన అదనపు ఓటర్లను జత చేస్తారు. జూలై 10, 2025 తర్వాత 2026 ఫిబ్రవరి 5 వరకు నమోదైన అదనపు ఓటర్ల వివరాలను మండలాల వారీగా గుర్తించి వాటిని సంబంధిత పోలింగ్‌కేంద్రాల వారీగా ఉన్న జాబితాల్లో జత చేయనున్నారు.
గతేడాది చేపట్టినా..
జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియ గత సంవత్సరం సెప్టెంబర్‌లోనే ప్రాంరంభమైంది. రెండు దశల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకుగత సెప్టెంబర్ 29న నోటిఫికేషన్ ఇవ్వడంతో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. నామినేషన్లు దాఖలు చేశారు. అయితే హైకోర్టు అక్టోబర్ 9న ఇచ్చిన ఆదేశాలతో ఎన్నికలు నిలిచిపోయాయి. బీసీ రిజర్వేషన్లపై కోర్టులో పిటిషన్లు వేశారు. కాగా 2019 మే,6,10,14 తేదీల్లో గతంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యుల ఎన్నికలు పూర్తయ్యాయి. జూన్‌లోఎంపీపీ, జెడ్పీ చైర్మన్లను ఎన్నుకున్నారు. 2025 జూన్‌లో పదవీ కాలం ముగిసింది. అప్పటి నుంచి ప్రత్యేకాధికారుల పాలనల కొనసాగుతోంది. అయితే జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ పదవులపై కన్నేసిన ఆశావహులు ఎన్నికల కోసం ఎదురుచూస్తున్నారు. మే నెలలో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని సంకేతాలు రావడంతో ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది.
రెవెన్యూ భువనగిరి,
డివిజన్‌లు చౌటుప్పల్
మండలాలు 17
జెడ్పీటీసీ స్థానాలు 17
ఎంపీటీసీ స్థానాలు 178
పోలింగ్ కేంద్రాలు 1,001
ఓటరు జాబితాలు సిద్ధం చేయాలని ఎన్నికల సంఘం ఆదేశాలు
ఫ కదిలిన జిల్లా యంత్రాంగం
ఫ 23లోగా పూర్తికానున్న ప్రక్రియ


