సాక్షి, యాదాద్రి: అధికారులు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినా క్షేత్రస్థాయిలో మాత్రం కాంటాలు మొదలవ్వలేదు. పలు మండలాల్లో కేంద్రాలు తెరిచి వారం గడుస్తున్నా ఒక్క క్వింటా ధాన్యం కూడా సేకరించకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కేంద్రాల వద్ద వడ్ల కుప్పలు పోసి ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎండ తీవ్రత పెరుగుతుండటంతో ధాన్యం ఎండిపోయి తూకంలో నష్టం వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా అటు ఎండకు ఎండలేక, ఇటు ధాన్యం అమ్ముకోలేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
మిల్లుల కేటాయింపులో ఆలస్యం
గత వారం రోజులుగా అడ్డగూడూరు, మోత్కూరు, గుండాల, ఆలేరు, రాజాపేట, ఆత్మకూరు.ఎం మండలాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను అధికారులు ప్రారంభించారు. వలిగొండ, భువనగిరి, చౌటుప్పల్, నారాయణపురం, రామన్నపేటతోపాటు పలు మండలాల్లో ఇంకా ప్రారంభించలేదు. అయితే ప్రారంభమైన కేంద్రాలకు రైస్ మిల్లులను ట్యాగింగ్ చేయడంలో అధికారులు విఫలమయ్యారు. రైతులకు మాత్రం తేమ శాతం ఎక్కువగా ఉందని సాకు చెప్పి తప్పించుకుంటున్నారు. నిల్వ చేయడానికి ఖాళీ స్థలం లేదని తాము కొత్తగా వచ్చే ధాన్యం ఎలా దించుకోవాలని ప్రశ్నిస్తున్నారు. మరో వైపు మిల్లర్ల నుంచి ఇచ్చే పూచీకత్తు విషయంలో సివిల్ సప్‌లై అధికారులకు పేచి పడింది. ప్రభుత్వం తాజా నిబంధనలపై మిల్లర్లు ఆందోళనలో ఉన్నారు.
జిల్లాలో 3,14,621 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. ఇందులో అత్యధికంగా దొడ్డురకం సాగు చేశారు. అధికారులు 6,92,166 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేశారు. ప్రైవేట్‌గా మిల్లర్ల కొనుగోలు, స్థానిక ప్రజల అవసరాలు, రైతుల విత్తనాలకు పోను సుమారు 4.50లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని నిర్ణయించారు. ఇందులో దొడ్డు రకం 6,84,226 మెట్రిక్ టన్నులు, సన్నరకం 8 వేల మెట్రిక్ టన్నులు దిగుమతి అంచనా వేశారు. మొత్తంగా 351 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందులో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల కేంద్రాలు 179 ఐకేపీ కేంద్రాలు 154, ఎఫ్‌పీఓలు 15, మెప్మా 3 కేంద్రాలు ఉన్నాయి. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 20 కేంద్రాలు ప్రారంభించగా ఎక్కడ కూడా ధాన్యం కాంటా ప్రారంభం కాలేదు.
రాశులు పోసి
ఎదురుచూస్తున్న రైతులు
మోత్కూరు మార్కెట్ యార్డులో పీఏసీఎస్, పాటిమట్ల, ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాన్ని ఈనెల 9న ప్రారంభించారు. సుమారు 20 మంది రైతులు ధాన్యాన్ని తెచ్చి ఆరబోశారు. మాయిశ్చర్ రాలేదని కాంటా వేయడం లేదు. ఆత్మకూర్ (ఎం)లో ఈనెల 11న ఐకేపీ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు. 77 మంది రైతులు ధాన్యం రాశులు పోసి ఎదురుచూస్తున్నారు. యాదగిరిగుట్ట మండలం సైదాపురం, ఆలేరు మండలం గొలనుకొండ, కొల్లూరు, మందనపల్లి ఈనెల 12న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. రాజాపేట మండలంలో ఈనెల 13న ఐకేపీ కొనుగోలు కేంద్రం ప్రారంభించారు. గుండాల మండల కేంద్రంలో ఈనెల 14న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయగా.. అన్ని చోట్ల రైతులు వడ్ల రాశులు పోసి కాంటా వేయడం కోసం ఎదురు చూస్తున్నారు.
దిగుబడి, కొనుగోలు అంచనా
వివరాలు ఇలా.. (మెట్రిక్ టన్నుల్లో)
దొడ్డు రకం : 6,84116
సన్న రకం : 8000
మొత్తం దిగుబడి అంచనా : 6,92,166
కొనుగోలు అంచనా : 4,50,000
వరి సాగు విస్తీర్ణం : 3,14,621 ఎకరాలు
ఫ ధాన్యం కేంద్రాలు తెరిచినా మొదలు కాని కొనుగోళ్లు
ఫ వారం రోజులుగా కల్లాల్లోనే రైతుల నిరీక్షణ
ఫ తేమ శాతం ఎక్కువగా ఉందని సాకు చెప్పి తప్పించుకుంటున్న అధికారులు


