చౌటుప్పల్ : నిత్యం రద్దీగా ఉండే చౌటుప్పల్ బస్టాండ్ ప్రాంతంలో అండర్‌పాస్ లేకుండా పనులు చేయడం సరికాదని బీజేపీ రాష్ట్ర కమిటీ సభ్యుడు దూడల భిక్షంగౌడ్ అన్నారు. అండర్‌పాస్ నిర్మాణ పనులు ఇష్టానుసారంగా జరుగుతున్నాయని, ప్రధాన కూడలి ప్రాంతాల్లో అండర్‌పాస్‌లు ఇవ్వకుండా పనులు చేస్తున్నారని ఆరోపిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో బుధవారం చౌటుప్పల్‌లో ఆర్టీసీ బస్‌స్టేషన్ వద్ద జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. నిర్మాణ పనులు చేస్తున్న యంత్రాలను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా దూడల భిక్షంగౌడ్ మాట్లాడుతూ.. అండర్‌పాస్ ప్రారంభించే ప్రాంతాన్ని తమకు అనుకూలంగా ఉండేలా ముందుకు జరిపి పనులు చేయడం వల్ల బస్టాండ్ వద్ద అండర్‌పాస్ లేకుండా పోతుందన్నారు. ఈమేరకు ఆర్డీఓ శేఖర్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో మాజీ జిల్లా ఉపాధ్యక్షుడు రమనగోని శంకర్, మున్సిపల్ అధ్యక్షురాలు కడారి కల్పనయాదవ్, కౌన్సిలర్లు ఆలె శ్రీలతచిరంజీవి, బుడ్డ సురేష్, పోలేపల్లి లక్ష్మిముత్తయ్య, నాయకులు గుజ్జుల సురేందర్‌రెడ్డి, శాగ చంద్రశేఖర్‌రెడ్డి, కంచర్ల గోవర్ధన్‌రెడ్డి, దిండు భాస్కర్, అమృతం దశరథ, గోశిక పురుషోత్తం, బత్తుల జనార్దన్, ఊదరి రంగయ్య, గుర్రం రవీందర్, జి.వేణు, భాను, శేఖర్ పాల్గొన్నారు.


