తండ్రి కళ్లముందే కుమార్తె మృతి | - | Sakshi
Sakshi News home page

తండ్రి కళ్లముందే కుమార్తె మృతి

Feb 15 2026 12:47 PM | Updated on Feb 15 2026 12:47 PM

తండ్ర

తండ్రి కళ్లముందే కుమార్తె మృతి

బైక్‌పై వెళ్తుండగా ఢీకొట్టిన లారీ

చౌటుప్పల్‌ : తండ్రి, కుమార్తె బైక్‌పై వెళ్తుండగా లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తండ్రి కళ్లముందే కుమార్తె మృతిచెందింది. ఈ ఘటన హైదరాబాద్‌–విజయవాడ జాతీయ రహదారిపై చౌటుప్పల్‌ మున్సిపాలిటీ పరిధిలోని లింగోజిగూడెం శివారులో శనివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చౌటుప్పల్‌ మండలం ఆరెగూడెం గ్రామానికి చెందిన వడ్డగోని రమేష్‌, తన కుమార్తె రిహాన్సిక(9)తో కలిసి ద్విచక్ర వాహనంపై చౌటుప్పల్‌ నుంచి స్వగ్రామానికి వెళ్తున్నారు. లింగోజిగూడెం గ్రామ శివారులోకి రాగానే హైదరాబాద్‌ నుంచి వేగంగా వస్తున్న లారీ వీరి ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో రమేష్‌, రిహాన్సిక రోడ్డుపై పడిపోయారు. లారీ రిహాన్సిక తలపై నుంచి వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. రమేష్‌కు గాయాలు కాగా.. స్థానికులు అతడిని చికిత్స నిమిత్తం చౌటుప్పల్‌ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ మన్మథకుమార్‌ తెలిపారు.

అదృశ్యమై.. చెరువులో శవమై తేలి..

చిట్యాల: చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామ పరిధిలోని చెరువులో శనివారం వృద్ధురాలి మృతదేహం లభ్యమైంది. చిట్యాల ఎస్‌ఐ ఎం. రవికుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. చౌటుప్పల్‌ మండలం రెడ్డిబావి గ్రామానికి చెందిన నందగిరి రాములమ్మ(81)కు మతిస్థిమితం సరిగా లేదు. గతేడాది డిసెంబర్‌ 19 నుంచి ఆమె కనిపించడంలేదు. డిసెంబర్‌ 22న ఆమె కుటుంబ సభ్యులు చౌటుప్పల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేశారు. చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామ శివారులోని చెరువులో శనివారం గుర్తుపట్టలేని స్థితిలో ఉన్న మృతదేహాన్ని గుర్తించిన గొర్రెల కాపరులు వెంటనే గ్రామస్తులకు సమాచారం అందించారు. గ్రామస్తులు సమాచారం మేరకు చిట్యాల ఎస్‌ఐ రవికుమార్‌ చెరువు వద్దకు వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. రాములమ్మ కుటుంబ సభ్యులు వచ్చి దుస్తులు, చెప్పులు చూసి మృతదేహం ఆమెదేనని గుర్తించారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టిన బైక్‌

ఇద్దరు యువకులు దుర్మరణం

వలిగొండ : బైక్‌పై వెళ్తున్న విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొని మృతిచెందారు. ఈ ఘటన వలిగొండ మండలం సుంకిశాల గ్రామంలో శనివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వలిగొండ మండల కేంద్రానికి చెందిన కళ్లెం పరమేష్‌(23) డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతడితో పాటు సుంకిశాలకు చెందిన పోలేపెల్లి మనోజ్‌ (18) కలిసి బైక్‌పై పని నిమిత్తం రెడ్లరేపాక గ్రామ పరిధిలోని మర్లపాడుకు వెళ్లి వస్తుండగా.. సుంకిశాలలోని ప్రభుత్వ పాఠశాల సమీపంలో విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టారు. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు భువనగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే వారు మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ యుగంధర్‌ తెలిపారు.

తండ్రి కళ్లముందే కుమార్తె మృతి 
1
1/2

తండ్రి కళ్లముందే కుమార్తె మృతి

తండ్రి కళ్లముందే కుమార్తె మృతి 
2
2/2

తండ్రి కళ్లముందే కుమార్తె మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement