నేనున్నాను.. మీరు బాధపడొద్దు
● మున్సిపల్ ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులకు ఎమ్మెల్యే ఐలయ్య భరోసా
ఆలేరు: ఆలేరు మున్సిపాలిటీలో ఓటమిపాలైన కాంగ్రెస్ అభ్యర్థులను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పరామర్శించారు. శనివారం రాష్ట్ర మహిళా సహకార అభివృద్ధి సంస్థ చైర్‌పర్సన్ బండ్రు శోభారాణి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జనగాం ఉపేందర్‌రెడ్డితో కలిసి 1, 3, 4, 5, 8 వార్డుల అభ్యర్థులు చింతలఫణి సునీతాశ్రీనివాస్‌రెడ్డి, సందిల సురేష్, గుత్త శమంతారెడ్డి, చింతకింది మురళి, పాము అనితల నివాసాలకు ఎమ్మెల్యే వెళ్లి పరామర్శించారు. వారు వెళ్లగానే మహిళా అభ్యర్థులు బోరున విలపించారు. నమ్మించి మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధపడొద్దని తాను, పార్టీ అండగా ఉంటామని ఎమ్మెల్యే ఓదార్చారు. ఓడిపోయిన అభ్యర్థులు ఆయా వార్డులకు ఇన్‌ఛార్జిలుగా ఉంటారని, వార్డు ప్రజలకు సంక్షేమ ఫలాలు వారి ద్వారా అందించేలా బాధ్యతలు అప్పగిస్తామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. ఐదుగురు అభ్యర్థులు తమ ఓటమికి కారణాలను సూచనప్రాయంగా ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా పరిశీలిస్తానన్నారు. ఆయన వెంట నాయకులు ఇజాజ్, ముదిగొండ శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.


