సరైన పద్ధతులతో నల్ల తామర నివారణ
గుర్రంపోడు : నాలుగేళ్లుగా మిరుపలో నల్ల తామర తెగులు తీవ్రంగా ఉంటోందని, దీని ఉనికిని సకాలంలో గుర్తించి సరైన యాజమాన్య పద్ధతులు పాటించాలని ప్రాంతీయ ఉద్యానవన అధికారి కె. మురళి అన్నారు. సోమవారం గుర్రంపోడు మండలంలోని చేపూరు, మొసంగి గ్రామాల్లో మిరుప తోటలను ఆయన పరిశీలించి రైతులకు పలు సూచనలు చేశారు. అధిక నత్రజని ఎరువులను వేసుకోకుండా సిఫారసు చేసిన మోతాదులోనే యూరియా అందించాలన్నారు. నల్ల తామర పురుగుకు కలుపు మొక్కలు ఆవాసాలుగా ఉంటాయి కాబట్టి పొలం గట్టు మీద ఉన్న కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు నిర్మూలించుకోవాలన్నారు. పురుగులు బెట్ట పరిస్థితుల్లో వచ్చే అవకాశం ఉన్నందున భూమిలో తగినంత తేమతో పురుగు ఉధృతిని నివారించవచ్చున్నారు. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు బెవరియా బెసినియా లేదా లెకానిసిలియం లెకాని 5 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలన్నారు. చివరి అస్త్రంగా సయాంట్రానిలిప్రోల్ 1.2 మి.లీ. లేదా స్పైనోసాడ్ 0.32 మి.లీ. లేదా ఫిఫ్రోనోల్ 80 డబ్లుజీ 0.2 గ్రాములు లేదా పిప్రోనిల్ మరియు ఇమిడా క్లోఫ్రిడ్ 0.2 గ్రాములు లేదా స్పైనటోరం ఒక మిల్లీలీటరు ఒక లీటరు నీటికి కలిపి మందులను మారుస్తూ పిచికారీ చేయాలని సూచించారు.


