ఆస్తి కోసం అంత్యక్రియలు నిలిపివేత
శాలిగౌరారం : ఆస్తి తగాదాతో ఓ వృద్ధురాలి అంత్యక్రియలను కుటుంబ సభ్యులు నిలిపివేశారు. రెండు రోజులుగా ఇంటిముందు మృతదేహంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వివరాలు.. శాలిగౌరారం మండలం ఆకారం గ్రామానికి చెందిన అయితగోని పెంటయ్య, అక్కులయ్య ఇద్దరు అన్నదమ్ములు. వీరు తల్లిదండ్రులు సంపాందించిన 12 ఎకరాల వ్యవసాయ భూమిని ఒక్కొక్కరు 6 ఎకరాలు చొప్పున సమానంగా పంచుకున్నారు. పెంటయ్యకు ఇద్దరు కుమారులు రవీందర్, జానయ్యతో పాటు కుమార్తె ఉన్నారు. అక్కులయ్యకు సంతానం లేరు. దీంతో అక్కులయ్య అతడి భార్య శాంతమ్మ(65)ను పెంటయ్య ఇద్దరు కుమారులు చూసుకునేవారు. అక్కులయ్య తన భాగానికి చెందిన 6 ఎకరాల భూమిని అన్న కుమారులైన రవీందర్, జానయ్యకు 3 ఎకరాల చొప్పున పంచి ఇచ్చాడు. అక్కులయ్య భార్య శాంతమ్మ తల్లిగారి గ్రామం కూడా ఆకారం కావడంతో శాంతమ్మకు ఆమె తల్లిదండ్రులు 8 ఎకరాల వ్యవసాయ భూమి ఇచ్చారు. అందులో ప్రస్తుతం శాంతమ్మ పేరున 5.15 ఎకరాల భూమి పట్టా ఉండగా.. 2.25 ఎకరాల భూమి ఇతరుల పేరున పట్టా కలిగి ఉంది. ఇదిలా ఉండగా నాలుగు సంవత్సరాల క్రితం అక్కులయ్య అన్న కుమారుల్లో చిన్న కుమారుడు జానయ్య అనారోగ్యంతో మృతిచెందాడు. అప్పటి నుంచి అక్కులయ్య–శాంతమ్మ దంపతులు పెద్ద కుమారుడైన రవీందర్ వద్ద ఉంటున్నారు. దీంతో శాంతమ్మ తన పేరున ఉన్న 5.15 ఎకరాల భూమిలో 5 ఎకరాలను రవీందర్ కుమారులైన శ్రవణ్‌కుమార్‌కు 2 ఎకరాలు, లవకుమార్‌కు 3 ఎకరాలు పట్టా మార్పిడి చేసేందుకు గత సంవత్సరం ఫిబ్రవరిలో స్లాట్ బుక్ చేసుకొని తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లింది. దీంతో విషయం తెలుసుకున్న జానయ్య భార్య, కుమారుడు తహసీల్దార్ కార్యాలయం వద్దకు చేరుకొని అక్కులయ్య–శాంతమ్మ దంపతులతో పాటు రవీందర్ కుటుంబ సభ్యులతో గొడవ పడటంతో ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో 2025 ఏప్రిల్‌లో శాంతమ్మ తనకున్న 5.15 ఎకరాల భూమిలో నుంచి రవీందర్ కుమారులకు 5 ఎకరాలు రిజిష్ట్రేషన్ చేసింది. దీంతో రవీందర్, జానయ్య కుటుంబ సభ్యుల మధ్య భూతగాదాలు జరుగుతూనే ఉన్నాయి.
శాలిగౌరారం మండలం
ఆకారం గ్రామంలో ఘటన
అనారోగ్యంతో శాంతమ్మ మృతి
రవీందర్ ఇంటి వద్ద ఉంటున్న అక్కులయ్య–శాంతమ్మ దంపతుల్లో శాంతమ్మ అనారోగ్యంతో ఆదివారం మధ్యాహ్నం మృతిచెందింది. సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించేందుకు రవీందర్ ప్రయత్నించగా జానయ్య కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. శాంతమ్మ ఆస్తి నుంచి తమ వాటా సమానంగా పంపిణీ జరిగే వరకు అంత్యక్రియలు జరుగనీయమన్నారు. రాత్రి కావడంతో శాంతమ్మ అంత్యక్రియలు నిలిచిపోయాయి. సోమవారం కూడా పరిస్థితి అలాగే మారడంతో గొడవకు దారితీసింది. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ సైదులు విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో శాలిగౌరారం, కట్టంగూర్ ఎస్‌ఐల నేతృత్వంలో 10 మంది పోలీసులు శాంతమ్మ మృతదేహం బందోబస్తు నిర్వహించారు. గ్రామపెద్దలు నచ్చజెప్పినా వినలేదు. సోమవారం రాత్రి వరకు శాంతమ్మ మృతదేహం రవీందర్ ఇంటిముందే ఉంది. అయితే జానయ్య కుమారుడు ఉమేశ్.. శాంతమ్మ మృతిపై అనుమానాలు ఉన్నాయని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని శాంతమ్మ మృతదేహాన్ని సోమవారం రాత్రి పోస్టుమార్టం నిమిత్తం నకిరేకల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఆస్తి కోసం అంత్యక్రియలు నిలిపివేత


