చలికాలం జీవాల పెంపకంలో జాగ్రత్తలు
త్రిపురారం : రోజురోజుకు చలి తీవ్రత పెరుగుతూ ఉంది. దీంతో జీవాలు, పశువులు జబ్బుల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంది. జీవాలు, పశువులు వ్యాదుల బారిన పశు పోషకులు, జీవాల పెంపకందారులు అప్రమత్తంగా ఉండాలని త్రిపురారం మండల పశువైద్యాధికారి నాగేందర్ సూచిస్తున్నారు. చలికాలం జీవాల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆయన మాటల్లోనే..
1. జలుబు, దగ్గు :
● తీవ్రమైన చలి ఉన్నప్పుడు జీవాలకు జలుబు, దగ్గు సోకితే తుమ్ములతో పాటు కళ్లు, ముక్కు నుంచి నీరు కారడం, చీమిడి పసుపు రంగులోకి మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
● క్రిముల ద్వారా సోకే అంటువ్యాధులతో పాటు ఆహారం ద్వారా శ్యాసకోశంలోకి వచ్చే కణాలు, నూనె పదార్థాలు, శ్వాసకోశాన్ని చికాకు పెట్టే ఇతర పదార్థాలు జలుబు, దగ్గుకు కారణమవుతాయి.
● జీవాల పాకలు ఇరుకుగా ఉండటం.. గాలి, వెలుతురు సరిగా లేకపోవడం.. పాకల్లో తేమ, తడి ఎక్కువగా ఉండడం.. కాలుష్యం, దుమ్ము వాతావరణంలో అకస్మాతుగా వచ్చే మార్పులు ఈ జబ్బుకు కారణమవుతాయి.
● వ్యాధి నివారణకు పాకలోకి గాలి, వెలుతురు వచ్చేలా చూడాలి. వాతావరణం సరిగా లేనప్పుడు జీవాలను బయటకు వదలకూడదు. పాకలను శుభ్రంగా ఉంచాలి. జబ్బులు సోకిన వెంటనే పశువైద్యాధికారులను సంప్రదించాలి.
● ఒకవేళ జీవం చనిపోతే పోస్టుమార్టం ద్వారా వ్యాధి నిర్ధారించుకొని మందలో మిగిలిన జీవాలకు వెంటనే చికిత్స చేయించుకోవాలి. వైద్యుల సూచనల మేరకు ముందు జాగ్రత్త టీకాలు వేయించుకోవాలి.
2. దొమ్మ రోగం :
● పశువుల్లో దొమ్మ రోగం వ్యాప్తికి పలు రకాల బ్యాక్టీరియాలు, వైరస్‌లు, పరాన్న జీవులు కారణం. కంటేజియస్ కాప్రెస్ ప్లూరో నిమోనియా అనే వైరస్ కారణంగా మేకలకు మాత్రమే వచ్చే వ్యాధి ఇది.
● ఈ వ్యాధి సోకిన జీవాలకు తీవ్రమైన జ్వరం ఉంటుంది.
● వేగంగా శ్వాస పీల్చుకోవడం, ఎగ శ్వాస, ముక్కు నుంచి నీరు, చీమిడి కారడం, ఆకలి లేకపోవడంతో జీవాలు రోజురోజుకు నీరసించిపోతాయి.
● కల్లు ఎర్రబడి నీరుగారడం, వీపు భాగం వంగి ఉండడం, తల, మెడ ముందుకు సాగినట్లు కనిపిస్తాయి.
● ముక్కు రంధ్రాలు వెడల్పు అవుతాయి. త్వరగా చికిత్స చేయించకపోతే ఊపిరితిత్తులు వాచి వాటికి చీము పట్టే ప్రమాదం ఉంటుంది.
● ఈ లక్షణాలు అమ్మతల్లి వీవీఆర్ మొదలైన జబ్బుల్లో కూడా కనిపిస్తాయి. తేలికగా జీర్ణమయ్యే ఆహారం, శుభ్రమైన నీటిని అందిస్తూ ఎప్పటికప్పుడు టీకాలు వేయించాలి.
22 వరకు అమ్మతల్లి టీకాలు
పశుసంవర్థక శాఖ ఆధ్వర్యంలో గ్రామాల్లో పశువైద్య సిబ్బంది ఈ నెల 22వ తేదీ వరకు జీవాలకు అమ్మతల్లి వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రతి రైతు ఈ ఉచిత టీకాల కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి. చలి తీవ్రత ఉన్నందున టీకాలు వేయించకపోతే జీవాలు మరణించి రైతులు, కాపరులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది.
చలికాలం జీవాల పెంపకంలో జాగ్రత్తలు


