బస్వాపూర్
డెస్టినేషన్ వెడ్డింగ్ స్పాట్..
దేశ, విదేశాల్లో జరిగే వెడ్డింగ్‌లను మన రాష్ట్రంలోనే నిర్వహించడం ద్వారా ఆదాయంతోపాటు వేలాది మందికి ఉపాధి అవకాశాలు మెరుగుపర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. జిల్లాలోని భువనగిరి మండల పరిధిలోని బస్వాపూర్ రిజర్వాయర్ వద్ద పర్యాటకులను ఆకట్టుకునేలా ప్రైవేట్, పబ్లిక్ పార్టనర్‌షిప్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ కేంద్రం ఏర్పాటుకు సిద్ధమైంది.
ఇంటికి దూరంగా ప్రత్యేకంగా..
ఇంటికి దూరంగా అందమైన ప్రదేశాల్లో వివా వేడుకలు జరుపుకోవడాన్ని డెస్టినేషన్ వెడ్డింగ్ అంటారు. ఇతరదేశాలు, అందమైన ప్రకృతి రమణీయ ప్రాంతాలు, బీచ్‌లు, పర్వతాలు ఇలా జీవితాంతం గుర్తుండిపోయేలా ఈ వేడుక నిర్వహిస్తారు. ప్రస్తుతం బీచ్ వెడ్డింగ్‌కు గోవా, మాల్దీవులు, ప్యాలెస్, హిస్టారికల్ ప్రాంతాల కోసం రాజస్థాన్ లోని రాజభవనాలు, ఆగ్రాలోని తాజ్‌మహల్, ఉదయ్‌పూర్ సరస్సులు, కేరళ, ఇటలీ, ఇండోనేషియా, థాయ్‌లాండ్‌తోపాటు మనదేశంలోని పలుచోట్ల డెస్టినేషన్ వెడ్డింగ్‌లు జరుగుతున్నాయి. పెళ్లికోసం ఇరు కుటుంబాలు కొద్ది మందిని తీసుకుని విమానాల్లో డెస్టినేషన్ సెంటర్‌లకు వెళ్తారు.
ప్రభుత్వం అనుమతిస్తే చాలు..
బస్వాపూర్‌లో 93 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది. హిల్స్, అప్‌అండ్ డౌన్ ప్రాంతాలు, రిజర్వాయర్‌లో నీరు నింపితే అద్భుతంగా వెడ్డింగ్ డెస్టినేషన్ కింద అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో పలువురు పెట్టుబడిదారులు ఇక్కడికి వచ్చి సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నారు. ఎవరైనా ఔత్సాహికులు ముందుకొచ్చి తమ ప్రాజెక్టు వివరాలను ప్రభుత్వానికి వివరించాలి. ప్రభుత్వం వారి ప్రతిపాదనలు అంగీకరిస్తే డీపీఆర్ సిద్ధం చేయాల్సి ఉంటుంది. డీపీఆర్‌లను ప్రభుత్వం ఒకే చేస్తే భూమిని అద్దె ప్రాతిపదికన కేటాయిస్తుంది. సబ్ రిజిస్ట్రార్ విలువపై ఐదు శాతం అద్దె చెల్లించాల్సి ఉంటుంది. రూ.500 కోట్ల ప్రాజెక్టుకు 66 ఏళ్లు అద్దెకు ఇస్తారు. వచ్చిన లాభాల్లో అసెట్‌డెవలప్ మెంట్ ఫండ్ చెల్లించాల్సి ఉంటుంది. సీఎం, టూ రిజం, రెవెన్యూ, ఆర్థిక శాఖల మంత్రుల కమిటీ ఆధ్వర్యంలో వీటిపై నిర్ణయాలు తీసుకుంటారు. ఔత్సాహిక పెట్టుబడిదారులు ఇప్పటికే బస్వాపూర్ వచ్చి స్థల పరిశీలన చేసి వెళ్తున్నారు.
గతంలో ప్రతిపాదనలు ఇలా..
యాదగిరిగుట్టకు వచ్చే భక్తులకు ఆధ్యాత్మికత తర్వాత పర్యాటకాన్ని అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధంచేశారు. ఇందులో బస్వాపూర్ రిజర్వాయర్ వద్ద సుమారు 93 ఎకరాల్లో కర్ణాటకలోని బృందావనం గార్డెన్‌ను అభివృద్ధి చేస్తామని అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. భువనగిరి మండలం బస్వాపురం చెరువును రిజర్వాయర్‌గా మార్చారు. 11.39టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం రిజర్వాయర్‌ను నిర్మించారు. బస్వాపురం రిజర్వాయర్‌ను సాగు, తాగునీటి అవసరాలతోపాటు ప్రపంచ స్థాయి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దే చర్యలు ప్రారంభం అయ్యాయి.
బస్వాపూర్ రిజర్వాయర్
బృందావనంగా అభివృద్ధికి
ప్రభుత్వం చర్యలు
పలు నిర్మాణాలు చేపట్టేలా
ప్రత్యేక కార్యాచరణ
ఇటీవల ప్రకటించిన
టూరిజం శాఖ మంత్రి జూపల్లి
ప్రాజెక్టుల ఏర్పాటుకు గాను
పెట్టుబడిదారులకు ఆహ్వానం
పర్యాటకులను రప్పించేలా
యాదగిరిగుట్టకు వచ్చే భక్తులతోపాటు దేశ, విదేశాలకు చెందిన లక్షలాది మంది భక్తులు, పర్యాటకులను ఇక్కడికి రప్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా బస్వాపురం రిజర్వాయర్ పూర్తి చేసి అందులో డెస్టినేషన్ వెడ్డింగ్‌కు అనుకూలంగా పలు నిర్మాణాలు చేపట్టనున్నారు. వాటర్ బోటింగ్, ఉద్యానవనాలు, అభయారణ్యాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు, కల్యాణ మంటపాలు, విశాలమైన రోడ్లు, ఇలా భక్తులకు ఆహ్లాదరకర వసతులు కల్పిస్తారు. ఈ ప్రాంతం పర్యాటకులను ఆకర్షిస్తే ఇక్కడ ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి.
బస్వాపూర్


