‘గుట్ట’ ఓటరు జాబితా గందరగోళం
యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట మున్సిపల్ ఓటరు జాబితా గందరగోళంగా రూపొందించారు. ఇందుకు మున్సిపల్ అధికారుల తప్పిదాలే కారణమని తెలుస్తోంది. ఒకే ఇంటి నంబర్‌పై చాలా ఓట్లు ఉండడం ఏమిటని మున్సిపల్ అధికారులను స్థానిక నాయకులు నిలదీస్తున్నారు.
ముసాయిదా విడుదలతో బట్టబయలు..
ఈ నెల 1న అధికారులు యాదగిరిగుట్ట మున్సిపల్ ఓటరు ముసాయిదా జాబితాను విడుదల చేశారు. ఈ ఓటరు లిస్టులను రాజకీయ పార్టీల నాయకులు, స్థానికులు పరిశీలిస్తే ప్రధానంగా 6వ వార్డులో 3–133 ఇంటి నంబర్‌తో పాటు అదే ఇంటికి బై నంబర్లు ఉండి సుమారు 92 ఓట్లు ఉన్నాయి. 9వ వార్డులో సైతం 4–223 ఇంటి నంబర్‌పై 20 ఓట్ల వరకు నమోదైన విషయం బట్టబయలైంది.
పక్క ఇంటి నంబర్‌తో ఓటు హక్కు..
1995లో సుమారు ఐదు సంచార జాతి కుటుంబాలు మహబూబ్‌నగర్ జిల్లా నుంచి వలసొచ్చి పాత గుండ్లపల్లిలో ఉంటూ ఓటు హక్కు పొందారు. ప్రస్తుతం వీరు 15 కుటుంబాలు కాగా 90 ఓట్లు కలిగి ఉన్నారు. వీరిలో 35మంది ఓటర్లు మాత్రమే స్థానికంగా ఉంటుండగా మిగతా వారు ఇతర ప్రాంతాలకు వెళ్లి పనులు చేసుకొని వస్తుంటారు. వీరికి స్థానికంగా సొంతిళ్లు లేక ఓ ప్రయివేట్ స్కూల్ పక్కనే గుడిసెలు వేసుకొని ఉంటున్నారు. వీరికి స్కూల్‌కు సంబంధించిన ఇంటి నంబర్‌ను ల్యాండ్ మార్క్‌గా వేశారు. దీంతో ఒకేఇంటి నంబర్‌పై 92ఓట్లు ఉన్నట్లు లిస్టులో చూపెడుతుంది. ఇక 9వ వార్డులో సుమారు 20 ఓట్ల వరకు ఒకే ఇంటి నంబర్‌ను కలిగి ఉన్నాయి. గతంలో ఓ ముస్లిం ఇంట్లో 5 కుటుంబాలు అద్దెకు ఉన్నవారికి అదే ఇంటి నంబర్‌పై ఓటు హక్కు కల్పించారు. ప్రస్తుతం ఆ ఓటర్లు ఆ ముస్లిం ఇంట్లో నుంచి వెళ్లి అదే వార్డులోనే మరొకరి ఇంట్లో ఉంటున్నా గతంలో ఉన్న ఇంటి నంబర్‌పైనే ఓటు నమోదైంది. వీరందరికి ప్రస్తుతం నివాసముంటున్న ఇంటి నంబర్లు ఓటరు జాబితాలో చేర్చితే ఇబ్బందులు తలెత్తవని స్థానికులు అంటున్నారు. మున్సిపాలిటీలోని అన్ని వార్డుల్లో ఓటరు జాబితాలు తప్పుల తడకగా మారాయి. ప్రస్తుతం నివాసం ఉంటున్న వార్డులో కాకుండా ఇతర వార్డులో ఓట్లు మారాయి.
6వ వార్డులో ఒకే ఇంటి నంబర్‌పై 92 ఓట్లు
9వ వార్డులోనూ అదే పరిస్థితి
ఇల్లు ఒక వార్డులో.. ఓటు మరో వార్డులో..
అధికారుల తప్పిదమే కారణం


