
బాలల చట్టాలపై అవగాహన అవసరం
రాజాపేట: విద్యార్థి దశలోనే చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని రాచకొండ పోలీస్ కమిషనరేట్ యాంటీ హ్యుమన్ ట్రాఫికింగ్ యూనిట్ (ఏహెచ్‌టీయూ) పోలీసు అధికారులు విద్యార్థులకు సూచించారు. ఇకనుంచి అన్ని అత్యవసర పరిస్థితుల్లో డయల్ 112కు ఫోన్‌చేసి వేగవంతమైన సేవలు పొందవచ్చన్నారు. రాజాపేట పోలీసు స్టేషన్ పరిధిలోని రఘునాథపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు బాలల చట్టాలు, సైబర్ నేరాలు, భారతీయ న్యాయ సంహిత చట్టాలపై గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏహెచ్‌టీయూ ఎస్‌ఐలు వెంకట్ శ్రీను, రాములునాయక్, యండీ ఖలీల్ అహ్మద్, మహిళా ఏఎస్‌ఐ మీనాకుమారి విద్యార్థులకు పలు విషయాలపై అవగాహన కల్పించి చట్టాలపై వారి అనుమానాలను నివృత్తి చేశారు. బాలలతో పని చేయించడం, బాలలపై లైంగిక వేధింపులు, బాల్య వివాహాలు, బాలల అక్రమ రవాణా తీవ్రమైన నేరాలని తెలిపారు. రోడ్డు భద్రతా నియమాలు తప్పనిసరిగా పాటించాలని, మత్తు పదార్థాలను అలవాటు చేసుకోవద్దని సూచించారు. సైబర్ బెదిరింపులు, సైబర్ మోసాలకు గురైతే గతంలో డయల్ 1930, ఉమెన్ హెల్ప్ లైన్ 1091, 181, చైల్డ్ హెల్ప్ లైన్ 1098, 112, 100 నంబర్లను ఉపయోగించేవారని, ప్రస్తుతం 112కు కాల్ చేస్తే అన్ని రకాల అత్యవసర సేవలు వేగంగా పొందవచ్చని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు శివరామకృష్ణ, ఉపాధ్యాయులు అపర్ణాదేవి, శ్రీనివాసాచారి, సత్యనారాయణ, వెంకటేశ్వర్లు, బాలక్రిష్ణ, యాదయ్య, సరిత, భవాని పాల్గొన్నారు.