
ఎయిమ్స్‌లో మానసిక ఆరోగ్య దినోత్సవం
బీబీనగర్: మానసిక ఆరోగ్యంపై అవగాహన కీలకమని డాక్టర్ కల్నల్ శశికుమార్ పేర్కొన్నారు. బీబీనగర్ ఎయిమ్స్ వైద్య కళాశాలలో మనోరోగ చికిత్స విభాగం ఆధ్వర్యంలో శనివారం ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం నిర్వహించారు. మానసిక ఇబ్బందులున్న వ్యక్తులు అత్యవసర, సంక్షోభ సమయాల్లో సమస్యను అధిగమించడం, ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకునే అంశాలపై వైద్య విద్యార్థులకు అవగాహన కల్పించారు. మత్తు పదార్థాల వినియోగం, నేరప్రవృత్తి, పేదరికం, కుటుంబంలో గొడవల వంటివి మానసిక సమస్యలు దారి తీస్తాయన్నారు. వీటికి దూరంగా ఉండటం వల్ల మానసిక ఇబ్బందుల నుంచి బయటపడవచ్చన్నారు. అనంతరం విద్యార్థులకు రంగోళి, పేయింటింగ్, క్విజ్ పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎయిమ్స్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ అహంత శాంతా సింగ్, డీన్ అశోక్ జాన్, మెడికల్ సూపరింటెండెంట్ మహేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.