భువనగిరి: బాలికలపై వివక్ష చూపొద్దని, వారికి అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కల్పించాలని న్యాయవాది నాగేంద్రమ్మ అన్నారు. జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం భువనగిరిలోని కేజీబీవీలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆమె మాట్లాడారు. సమాజంలో లింగ వివక్ష ఇంకా కొనసాగుతోందని, ఇది ఎంతమాత్రం సరైంది కాదన్నారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేయడానికి ప్రయత్నించే ఆస్పత్రులపైనా నిఘా ఏర్పాటు చేయాలన్నారు. రాజ్యాంగం మహిళలకు సమాన అవకాశాలు కల్పించిందని వాటిని వినియోగించుకోవాలని పేర్కొన్నారు. హెల్త్ కోచ్, న్యూట్రిషనిస్ట్ జెస్పీ రోజీ బాలికల హక్కులు, సంరక్షణ గురించి అవగాహన కల్పించారు. అదే విధంగా భువనగిరిలోని గిరిజన అశ్రమ బాలికల పాఠశాలలో యాక్షన్ ఎయిడ్ కర్నాటక ప్రాజెక్టు ఆధ్వర్యంలో బాలికా దినోత్సవం నిర్వహించారు.లింగ వివక్షత లేని సమాజ నిర్మాణం కోసం కృషి చేయాలని యాక్షన్ ఎయిడ్ కమ్యూనిటీ ట్రైనర్ సురుపంగ శివలింగం పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ నారాయణరెడ్డి, సామాజిక సంఘాల ప్రతినిధులు దేవేందర్, మంద శివ, దాసరి స్వామి, ఉపాధ్యాయులు రాంబాయి పాల్గొన్నారు.