
323 దరఖాస్తులు
భువనగిరి: జిల్లాలో మద్యం టెండర్లకు భారీగా స్పందన వస్తోంది. టెండర్లు వేసేందుకు వ్యాపారులు పోటీ పడుతున్నారు. శనివారం ఒక్క రోజే 96 దరఖాస్తులు దాఖలయ్యాయి. దరఖాస్తు గడువు ఈనెల 18న ముగియనుంది. ఇప్పటి వరకు మొత్తం 323 దరఖాస్తులు వచ్చినట్లు ఎకై ్సజ్ అధికారులు తెలిపారు. మరో వారం రోజులు సమయం ఉన్నందున భారీగా టెండర్లు వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
నారసింహుడికి సంప్రదాయ పూజలు
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో శనివారం సంప్రదాయ పూజలు ఆగమశాస్త్రం ప్రకారం ఘనంగా నిర్వహించారు. వేకువజామున ఆలయాన్ని తెరిచిన అర్చకులు.. స్వామి, అమ్మవారికి సుప్రభాత సేవ చేపట్టారు. అనంతరం గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు నిజాభిషేకం చేసి తులసీదళాలతో అర్చించారు. ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహహోమం, గజవాహన సేవ, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం తదితర పూజలు గావించారు. సాయంత్రం ఉత్సవమూర్తుల వెండి జోడు సేవలను ఊరేగించారు. రాత్రి స్వామివారికి శయనోత్సవం చేసి ఆలయ ద్వారబంధనం చేశారు.
ప్రవక్త జీవిత చరిత్రపై విద్యార్థులకు పోటీ పరీక్ష
భువనగిరిటౌన్ : మహ్మద్ ప్రవక్త జీవిత చరిత్రపై శనివారం భువనగిరి పట్టణంలోని ఖదీం జామియా ఇస్లామియా అరేబియా పాఠశాలలో జలీల్‌పుర మసీద్ కమిటీ ఆధ్వర్యంలో రాత పోటీ పరీక్ష నిర్వహించారు. పరీక్షకు 120 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మసీద్ కమిటీ కోశాధికారి రహీముద్దీన్, సభ్యుడు సుజావుద్దీన్ మాట్లాడుతూ.. విద్యార్థులకు మహ్మద్ ప్రవక్త జీవిత చరిత్రపై అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో పరీక్ష నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ ప్రధాన సలహాదారుడు ఉస్మాన్ చౌదరి, డాక్టర్ షేక్ హమీద్ పాష, ఇషాక్, ఫుర్ఖాన్, మాస్, సైఫుల్లా, షాహిద్ పాల్గొన్నారు.
రంజి ట్రోఫీ ఫీల్డింగ్ కోచ్‌గా ఎంపిక
బీబీనగర్: రంజి ట్రోఫీ క్రికెట్ ఫీల్డింగ్ కోచ్‌గా బీబీనగర్ మండలంలో ని కొండమడుగు గ్రామానికి చెందిన చంద్రగౌని బాలగణేష్‌గౌడ్ ఎంపికయ్యారు. జాతీయ స్థాయిలో గల బరోడా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన సెలక్షన్లలో గణేష్ ఉత్తమ ప్రతిభ కనబరచడంతో కోచ్‌గా ఎంపిక చేశారు. ఈనెల 15వ తేదీ నుంచి వివిధ రాష్ట్రాల్లో జరగనున్న రంజి క్రికెట్ పోటీల్లో కోచ్‌గా వ్యవహరించనున్నాడు.
13న క్రీడాకారుల ఎంపిక పోటీలు
నల్లగొండ టూటౌన్ : స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈనెల 13న నల్లగొండలోని మేకల అభినవ్ స్టేడియంలో అండర్–14, 17 బాల బాలికలకు కబడ్డీ, వాలీబాల్, క్రికెట్ సెలక్షన్ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఎస్‌జీఎఫ్ కార్యదర్శి విమల తెలిపారు. బాల, బాలికలు సంబంధిత పాఠశాలల నుంచి బోనఫైడ్ సర్టిఫికెట్లతో పోటీలకు హాజరు కావాలని సూచించారు. వివరాలకు 9948987026, 7997416876 నంబర్లలో సంప్రదించాలని పేర్కొన్నారు.

323 దరఖాస్తులు