
అవగాహనతో రోడ్డుప్రమాదాల నివారణ
నల్లగొండ టూటౌన్: రోడ్డు భద్రతపై విద్యార్థులకు, ప్రజలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో శుక్రవారం సర్వేజన ఫౌండేషన్‌తో మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ మాట్లాడుతూ.. ప్రజలకు సరైన అవగాహన లేకపోవడంతోనే రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యువతకు అవగాహన కల్పించేందుకు వారు తమ, తమ గ్రామాల్లో ప్రచారం కల్పిస్తారని పేర్కొన్నారు. ప్రముఖ వైద్యులు గురువారెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జనార్దన్‌రెడ్డి నేతృత్వంలో సాగుతున్న సేవా కార్యక్రమాలను యూనివర్సిటీ పరిధిలోని విద్యాలయాల్లో నిర్వహిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ఆన్‌లైన్ ద్వారా జనార్థన్‌రెడ్డి మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా ఏడాదికి లక్షల్లో ప్రాణాలు కోల్పోయి వారి కుటుంబాలను నిరాశ్రయులను చేయడం అత్యంత విషాదకరన్నారు. కేవలం అవగాహన ద్వారా మాత్రమే రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ అలువాల రవి, ఐక్యూ ఏసీ డైరెక్టర్ మిర్యాల రమేష్, ప్రిన్సిపాల్ కౌత శ్రీదేవి, సురం శ్వేత, ఫౌండేషన్ ప్రతినిధి ప్రవీణ్ పాల్గొన్నారు.