మామిడిపై చిత‘్తశుద్ధి’ కరువు | - | Sakshi
Sakshi News home page

మామిడిపై చిత‘్తశుద్ధి’ కరువు

Jun 25 2026 12:24 AM | Updated on Jun 25 2026 12:24 AM

మూతబడిన సమగ్ర పండ్ల శుద్ధి కేంద్రం

నూజివీడులో 2007లో ఏర్పాటు

రెండేళ్లుగా పట్టించుకోని కూటమి ప్రభుత్వం

నూజివీడు: ఉద్యానవన పంటల కోసం కోట్లాది రూపాయల ఖర్చుతో నిర్మించిన సమగ్ర పండ్ల శుద్ధి కేంద్రం రెండేళ్లుగా మూతబడింది. కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి దీనిని పట్టించుకోకుండా గాలికొదిలేయడంతో ప్లాంట్‌ ఆవరణంతా పిచ్చిమొక్కలు పెరిగి చిట్టడవిని తలపిస్తోంది. ఏపీ ఆగ్రోస్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ప్లాంట్‌లో గతంలో మామిడి, అరటి, బొప్పాయి, జామ కాయలను ప్రాసెసింగ్‌ చేసి ఎగుమతి చేసేవారు. గత ప్రభుత్వం హయాంలో ఈ సమగ్ర పండ్ల శుద్ధి కేంద్రాన్ని ప్రైవేటు వ్యక్తులకు లీజుకు ఇవ్వడంతో లీజుకు తీసుకున్న వారు మామిడి, బొప్పాయి, జామ పండ్లను ప్రాసెసింగ్‌ చేసి వాటిని దేశంలోని ఇతర ప్రాంతాలకు, మలేషియా, దుబాయ్‌ వంటి దేశాలకు ఎగుమతి చేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం మాత్రం ఈ ప్లాంట్‌ను పక్కన పెట్టేసింది.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో 2007లో ఈ సమగ్ర పండ్ల శుద్ధి కేంద్రాన్ని నూజివీడులో రూ.12 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేశారు. ఈ కేంద్రం వల్ల నూజివీడు ప్రాంతంలో పండ్ల తోటలను సాగు చేస్తున్న రైతులకు ఎంతో మేలు జరుగుతుందనే లక్ష్యంతో అప్పట్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రాంతంలో సాగులో ఉన్న మామిడి, బొప్పాయి, జామతో పాటు టమోట, పలు రకాల కూరగాయలను సైతం ప్రాసెసింగ్‌ చేసి ఎగుమతి చేసుకోవడం ద్వారా రైతులకు మంచి ధర లభిస్తుందనే లక్ష్యంతో దీనిని ఏర్పాటు చేశారు. అయితే కూటమి ప్రభుత్వంకు తొలి నుంచి రైతులన్నా, వ్యవసాయం అన్నా అంత శ్రద్ధ చూపని నేపధ్యంలో ఈ కేంద్రాన్ని పట్టించుకోకుండా గాలికొదిలేసింది.

పండ్ల తోటల రైతులకు ఎంతో మేలు

సమగ్ర పండ్ల శుద్ధి కేంద్రం వల్ల రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. దీనిని వినియోగంలోకి తీసుకువచ్చి రైతుల్లో అవగాహన కల్పిస్తే ఉద్యాన ఉత్పత్తులకు మార్కెట్‌లో మంచి ధర లభించి రైతులు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ కేంద్రంలో వేపర్‌ హీట్‌ ట్రీట్‌మెంట్‌, ప్రాసెసింగ్‌, క్లీనింగ్‌, గ్రేడింగ్‌, రైపెనింగ్‌, ప్రీ కూలింగ్‌ వంటి సదుపాయాలు ఉన్నాయి. రైతులు రిలయన్స్‌, మోర్‌ వంటి మార్టులకు, విదేశాలకు మామిడి కాయలను ఎగుమతి చేయాలంటే ఇక్కడ ప్రాసెసింగ్‌ చేయించి మార్కెట్‌లకు తరలిస్తారు. వేపర్‌ హీట్‌ ట్రీట్‌మెంట్‌ ద్వారా మామిడి, బొప్పాయి, జామ వంటి కాయలను ఈ విధానంలో పండ్లకు ఎలాంటి హాని కలగకుండా వాటిల్లో ఉండే కీటకాల గుడ్లు, లార్వాలను నాశనం చేస్తారు. నీటి ఆవిరితో క్రిమి సంహారక చర్య జరుగుతుంది. దీనివల్ల పండ్ల నాణ్యత, తాజాదనం దెబ్బతినకుండా లోపల ఉండే పురుగులు నశిస్తాయి. ఎగమతి చేయడానికి అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా సర్టిఫికెట్‌ లభిస్తుంది. దీనిలో భాగంగా 2022లో 260 టన్నుల మామిడిని, 500 టన్నుల అరటి కాయలను ప్రాసెసింగ్‌ చేసి ఎగుమతి చేయడం జరిగింది. వీటిల్లో 22 టన్నుల మామిడికాయలను యూకే, జర్మనీలకు ఎగుమతి చేశారు. 120 టన్నుల మామిడిని రిలయన్స్‌ మార్టులకు, 115 టన్నుల మామిడి కాయలను మోర్‌ మార్కెట్‌కు ఎగుమతి చేశారు. అలాగే అరటి కాయలు 500 టన్నులను ప్రాసెసింగ్‌ చేసి ఎగుమతి చేయడం జరిగింది. ఇలా రైతులకు ఎంతో ప్రయోజనం కలిగిన కేంద్రాన్ని పట్టించుకోకుండా మూతేసింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement