తాడేపల్లిగూడెం : ఉద్యాన రైతు రాజు కావాలి.. తక్కువ నీటితో అఽధిక దిగుబడులు సాధించాలి.. ఆర్థిక స్వావలంబన సాధించాలి.. ఉద్యాన విద్య, ఉద్యాన పంటల విస్తరణ లక్ష్యాలుగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయాన్ని 19 ఏళ్ల క్రితం ఏర్పాటుచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం వెంకట్రామన్నగూడెంలో 2007 జూన్ 26న ఆంఽధ్రప్రదేశ్ ఉద్యాన విశ్వవిద్యాలయం వైఎస్ మానసపుత్రికగా ఏర్పడింది. దేశంలో రెండో ఉద్యాన విశ్వవిద్యాలయం ఇదే. 2012లో వైఎస్ మరణానంతరం ఆయన పేరిట అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి కేబినెట్ ఆంధ్రప్రదేశ్ ఉద్యాన విశ్వవిద్యాలయాన్ని డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయంగా మార్చింది. గత 19 ఏళ్లుగా విద్య, పరిశోధన, విస్తరణ లక్ష్యాలుగా వర్సిటీ పరుగులు తీస్తుంది. 5 ఉద్యాన కళాశాలలు, 4 ఉద్యాన పాలిటెక్నిక్‌లు, 20 పరిశోధనా కేంద్రాలు, 4 కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా రైతు లోకానికి సేవలందిస్తోంది. 34 నూతన ఉద్యాన వంగడాలను విడుదల చేసింది. కొబ్బరిచెట్టు ఎక్కే యంత్రం, తాటి ఉత్పత్తుల విలువ జోడింపు సాంకేతికత, జీడిమామిడి, ఆపిల్ జ్యూస్ ప్రాసెసింగ్‌కు సంబంధించి మూడు పేటెంట్లు వర్సిటీ సాధించింది. భారత వ్యవసాయ పరిశోధన మండలి నుంచి ఏ–గ్రేడ్ గుర్తింపు పొందింది. వర్సిటీ పరిశోధనా కేంద్రాలు జాతీయ స్థాయిలో ఉత్తమ కేంద్రాలుగా అవార్డులు సాధించాయి. విద్యను పూర్తి చేసుకున్న విద్యార్థులు ఉద్యోగులుగా, విదేశాల్లో విద్యను అభ్యసించే స్థాయికి ఎదిగారు. రైతుల కోసం ఉద్యాన మిత్ర, ఉద్యాన వాణి, రైతు సలహా కేంద్రం, డిజిటల్ విస్తరణ కార్యక్రమాలు చేపడుతోంది. వీసీ టు విలేజ్ ద్వారా 127 గ్రామాలను దత్తత తీసుకుని రైతులకు సాంకేతిక సేవలు అందిస్తున్నారు. 20వ వ్యవస్థాపక దినోత్సవానికి కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అతిథిగా హాజరుకానున్నారని ఉద్యాన వర్సిటీ వీసీ కె.ధనుంజయరావు తెలిపారు.
19 ఏళ్లు.. ఎన్నో మైలురాళ్లు
20వ వసంతంలోకి వైఎస్సార్ హర్టీకల్చరల్ వర్సిటీ
దివంగత వైఎస్ మానస పుత్రిక
వ్యవసాయ, ఉద్యాన రంగాల్లో విశేష సేవలు
రేపు వ్యవస్థాపక దినోత్సవం


