నిర్వాసితులకు నీటి కష్టాలు | - | Sakshi
Sakshi News home page

నిర్వాసితులకు నీటి కష్టాలు

Jun 25 2026 12:24 AM | Updated on Jun 25 2026 12:24 AM

జంగారెడ్డిగూడెం: మండలంలోని తాడువాయి పంచాయతీ పరిధిలో గల చల్లవారిగూడెం ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీలో నివాసముంటున్న నిర్వాసిత కుటుంబాలకు తాగునీటి కష్టాలు తీవ్రమయ్యాయి. కనీస అవసరాలకు కూడా నీరు లేక నానా ఇబ్బందులు పడుతున్నామని కాలనీవాసులు బుధవారం తాడువాయి పంచాయతీ సెక్రటరీని కలిసి తమ ఆవేదనను వెళ్లగక్కారు. అంతకుముందు కాలనీలో పనులు చేస్తున్న గుత్తేదారు సంస్థ ‘యూనిక్‌’ ప్రతినిధులను కూడా గ్రామస్తులు కలిసి సమస్యను పరిష్కరించాలని వేడుకున్నారు. ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ ఎన్నిసార్లు అధికారుల చుట్టూ తిరిగినా తమ సమస్య పరిష్కారం కావడం లేదని వాపోయారు. కాలనీలోని 800 కుటుంబాలకు కేవలం ఒకే ఒక్క నీటి ట్యాంక్‌ ఏ విధంగా సరిపోతుందని ప్రశ్నించారు. మోటార్‌ గేట్‌ వాల్వ్‌ పాడైపోవడం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని, దీనికి పరిష్కారంగా మిగిలిన ట్యాంకుల ద్వారా పైపులైన్‌ కనెక్షన్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. బాధితుల సమస్యలను విన్న పంచాయతీ సెక్రటరీ వారం, పది రోజుల్లో మోటార్‌ రిపేరు చేయిస్తామని హామీ ఇచ్చారు. కాలనీ కమిటీ సభ్యులు బద్దె ప్రేమ్‌ కుమార్‌, పెరుమాళ్ళ శ్రీను, నరసింహారావు, గుబ్బల విజయ్‌ బాబు, ముత్తబోయిన రమణయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement