వర్సిటీ మార్గనిర్దేశనంలో..
తాడేపల్లిగూడెం: నైరుతి రుతుపవనాలు వెనకడుగు వేస్తున్నాయి. వానలు కురవాల్సిన సమయంలో ఎండలు మండిపోతున్నాయి. దీంతో వరి, ఇతర పంటల దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరగడమే ఇందుకు కారణమని నిపుణులు చెబుతున్నారు. దీనిని ‘ఎల్‌నినో’ హెచ్చరికగా ఉద్యాన శాస్త్రవేత్తలు పరిగణిస్తున్నారు. సూపర్ ఎల్‌నినో హెచ్చరికలను దృష్టిలో ఉంచుకుని, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వెంకట్రామన్నగూడెంలోని డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం ప్రత్యేక కార్యాచరణను రూపొందించింది. ప్రస్తుతం ఉన్న ఎల్‌నినో పరిస్థితులు సూపర్ ఎల్‌నినోగా మారి, 2027 జనవరి వరకు ప్రభావం చూపే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. భారత జాతీయ సముద్ర సేవల కేంద్రం ఇచ్చిన హెచ్చరికల ఆధారంగా, విపత్కర పరిస్థితులను తట్టుకునేలా ఉద్యాన రైతులకు శాస్త్రవేత్తలు మార్గనిర్దేశం చేస్తున్నారు.
ఖరీఫ్ పంటలపై తీవ్ర ప్రభావం
ఎల్‌నినో వల్ల ఖరీఫ్ పంటలతో పాటు తెలుగు రాష్ట్రా ల్లోని ఉద్యాన పంటల దిగుబడి, నాణ్యత దెబ్బతినే ప్రమాదం ఉంది. సరైన యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా నష్టాన్ని తగ్గించుకోవచ్చు.
ఉద్యాన అధికారుల సూచనలు
● నీటి లభ్యత తక్కువగా ఉన్నప్పుడు బిందు సేద్యం, తుంపర సేద్యం పద్ధతులను పాటించాలి.
● నేలలోని తేమ ఆవిరి కాకుండా చెట్ల మొదళ్ల చుట్టూ ఎండుగడ్డి, ఆకులు లేదా ప్లాస్టిక్ షీట్లతో ‘మల్చింగ్’ చేయాలి.
● పండ్ల తోటల్లోని చెట్ల కాండానికి నేల మట్టం నుంచి మూడు అడుగుల ఎత్తు వరకు బోర్డో పేస్ట్ లేదా సున్నం పూయాలి.
● నారుమడులను ఎండల నుంచి రక్షించుకోవడానికి పాలిథిన్ షీట్లు, గ్రీన్ షేడ్ నెట్లను వినియోగించాలి.
● ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల వేరు కుళ్లు, రసం పీల్చే పురుగులు ఆశించే అవకాశం ఉంది. వ్యవసాయ అధికారుల సలహాతో మందులను పిచికారీ చేయాలి.
● ఉద్యాన తోటల్లో తక్కువ నీటిని తీసుకునే అంతర పంటలను సాగు చేసుకోవాలి.
పండ్ల తోటల్లో జాగ్రత్తలు
● మామిడిలో మల్చింగ్ చేయడం, రసం పీల్చే పురుగుల నుంచి కాండానికి రక్షణ కల్పించడం, బత్తాయిలో నీటి పొదుపు కోసం బాష్పోత్సేక నిరోధకాలను వాడటం, పోషకాలను పిచికారీ చేయడం చేయాలి.
● అరటిలో గాలి నుంచి రక్షణకు కంచె ఏర్పాటు, ఆకుల యాజమాన్యం, గెలల సంరక్షణ, పొటాష్ వాడకంలో అప్రమత్తంగా ఉండాలి.
● బొప్పాయిలో వైరస్ తెగుళ్ల నివారణ, సమతుల్య నీటి తడులు, బొబ్బ తెగులు నివారణ చర్యలు చేపట్టాలి.
● లేత జీడిమామిడిలో మల్చింగ్, కోకో, ఆయిల్ పామ్, తమలపాకు, టమాటా, మిరప, వంగ, సుగంధ ద్రవ్య పంటల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
ఆందోళనలో ఉద్యాన రైతులు
ఎల్‌నినో హెచ్చరికల నేపథ్యలో ఉద్యాన యూనివర్సిటీ రైతులను అప్రమత్తం చేస్తుంది. శాస్త్రవేత్తల బృందాలు క్షేత్రస్థాయికి వెళ్లి ఉద్యాన రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ఎల్‌నినో నుంచి పంటలను ఎలా రక్షించుకోవాలనే విషయాలపై కరపత్రాలను ప్రచురించి పంచుతున్నాం. రైతులు అవగాహనతో ఉంటే ఎల్‌నినోను అఽధిగమించవచ్చు.
– ధనుంజయరావు,
వైస్ చానల్సర్, వైఎస్సార్ ఉద్యాన వర్సిటీ


