మత్తు ఇచ్చి పట్టుకునేందుకు ఏర్పాట్లు
బుట్టాయగూడెం: బుట్టాయగూడెం మండలంలో పులి సంచారం ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. ఈ ఏడాది జనవరి 21న తెలంగాణ రాష్ట్రం అశ్వారావుపేట మండలం కావిడిగుండ్ల నుంచి జిల్లాలోకి ప్రవేశించి బుట్టాయగూడెం మండలం గుబ్బల మంగమ్మ గుడి మార్గంలో ప్రారంభమైన పులి యాత్ర మండలంలో సుమారు 13 ఆవులను హతమార్చిన అనంతరం పోలవరం మండలంలో ప్రవేశించి అక్కడి నుంచి గోదావరి ఈదుకుంటూ తూర్పుగోదావరి జిల్లాలో ప్రవేశించింది. ప్రత్యేక రెస్క్యూ టీమ్ రాయవరం మండలం కూర్మాపురంలో మత్తు ఇంజెక్షన్ ఇచ్చి పెద్దపులిని బంధించారు. కొద్దిరోజుల తర్వాత మళ్లీ పాపికొండల అభయారణ్యంలో అటవీశాఖ అధికారులు దానిని విడిచిపెట్టడంతో మళ్లీ సంచారం మొదలు పెట్టింది. పులికి అమర్చిన రేడియో కాలర్ ద్వారా దాని సంచారాన్ని అటవీశాఖ అధికారులు ఎప్పటికప్పుడు గమనిస్తూ గ్రామ సమీపాల్లో ప్రజలను హెచ్చరిస్తూ వస్తున్నారు. జిల్లాలోని పోలవరం మండలంలో ప్రవేశించిన పెద్దపులి మళ్లీ కొరుటూరు, సిరివాక, దారావడ దాటుకుంటూ బుట్టాయగూడెం మండలంలో మంగళవారం ప్రవేశించింది. అప్రమత్తమైన అధికారులు పులి కదలికలను గుర్తించి ఆయా గ్రామాల్లోని ప్రజలను అప్రమత్తం చేశారు. తెల్లవారేసరికి మండలంలోని పాలకుంట సమీపంలో 2 ఆవులపై దాడి చేసి చంపేసింది.
పులిని పట్టుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు
పెద్ద పులిని పట్టుకునేందుకు శ్రీశైలం టైగర్ జోన్ నుంచి వచ్చిన ప్రత్యేక బృందాలు వచ్చాయి. బృందానికి హెడ్‌గా ఉన్న కాళీచరణ్ ఆధ్వర్యంలో పులి సంచరించిన ప్రాంతాలు పరిశీలించారు. అటవీ శాఖ అధికారులు, ప్రత్యేక బృందాలు ప్రస్తుతం పులి సింగారమ్మతల్లి కొండ సమీపంలోనే ఉన్నట్లు గుర్తించారు. ఆవును చంపిన ప్రదేశానికి కొద్ది దూరంలోనే ఉండడంతో మళ్లీ ఇక్కడికి వస్తుందనే నమ్మకంతో పులి సంచరించే ప్రదేశంలో పేడ కళ్లాపిని చల్లడంతో పాటు మూడు మంచెలను ఏర్పాటు చేశారు. మంచెలపై మాటు వేసి మత్తు ఇంజెక్షన్‌తో పులిని బంధిస్తామని అధికారులు తెలిపారు. బోను, లాజిస్టిక్‌లు, తదితర సామాగ్రిని కూడా అధికారులు సిద్ధం చేసి ఉంచారు.


