భీమవరం: చంద్రబాబు ప్రభుత్వం పాలనలో బీసీ నాయకుల అణచివేత లక్ష్యంగా ముందుకు సాగుతున్నారని అందులో భాగంగానే వైఎస్సార్‌సీపీ ఏలూరు పార్లమెంట్ ఇన్‌చార్జ్ కారుమూరి సునీల్ కుమార్‌ను అక్రమంగా అరెస్టు చేశారని నరసాపురం పార్లమెంట్ ఇన్‌చార్జ్ గూడూరి ఉమాబాల అన్నారు. కక్ష సాధింపు చర్యలు భాగంగానే అక్రమ కేసులు పెట్టి ఆధారాలు లేకున్నా ఇళ్లల్లో సోదాలు చేస్తూ వారి పరువుకు భంగం కలిగిస్తున్నారన్నారు. గత ప్రభుత్వంలో జగన్‌మోహన్ రెడ్డి బీసీలకు పెద్దపీట వేసి రాజకీయంగా చైతన్యం చేయాలనే లక్ష్యంగా పనిచేశారన్నారు. సునీల్ కుమార్ ఏలూరు నియోజవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తుంటే కక్ష కట్టి, తప్పుడు కేసులు పెట్టి అక్రమ అరెస్టు చేసి అణచివేయాలని చూస్తున్నారన్నారు. వైఎస్సార్‌సీపీ ఎప్పుడూ బీసీలకు అండగా ఉంటుందని స్పష్టం చేశారు. రెడ్ బుక్ రాజ్యాంగంలో బీసీలను అన్ని రకాలుగా అణచివేయాలని అరాచక పాలన సాగిస్తున్నారన్నారు. సునీల్ కుమార్ క్లీన్‌చిట్‌తో బయటకు వస్తారని అన్నారు. పార్టీలోని బీసీ నాయకులపై పెడుతున్న తప్పుడు కేసులు నిలిచే పరిస్థితి ఉండదన్నారు. రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలకు తగిన మూల్యం చెల్లించుకుంటుందన్నారు.


