నరసాపురంలో పుష్కరాల పనులపై కనీస ప్రతిపాదనలు లేని వైనం
నరసాపురం: అఖండ గోదావరి పుష్కరాలకు సమయం ఆసన్నమవుతోంది. 2027 జూలై 27 నుంచి పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. 12 రోజులపాటు జరిగే ఈ పుణ్య స్నానాలకు దేశం నలుమూలల నుంచి లక్షలాది భక్తులు తరలివస్తారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో రాజమండ్రి, కొవ్వూరు తర్వాత అత్యధికంగా భక్తులు స్నానాలు చేసేది నరసాపురంలోనే. వశిష్ట గోదావరి అంతర్వేది వద్ద సముద్రంలో కలిసే ముందు, నరసాపురం సమీపంలో ప్రవహించడం ఇక్కడి ప్రత్యేకత. ఇన్ని విశిష్టతలు ఉన్నా, నరసాపురంలో పుష్కరాల అభివృద్ధి పనులపై ప్రజాప్రతినిధులు, అధికారుల్లో కనీస స్పందన కరువైంది. మున్సిపాలిటీ, పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ తదితర ఏ శాఖ కూడా ఇప్పటివరకు ఎటువంటి నిర్దిష్ట అంచనా ప్రణాళికలు సిద్ధం చేయలేదు.
సమయం తక్కువ.. పనుల జాడ సున్నా
2015 పుష్కరాల సమయంలో రెండేళ్ల ముందు నుంచే పనులు ప్రారంభమయ్యాయి. 2012 చివరి నుంచే అంచనాలు, టెండర్ల ప్రక్రియ మొదలైంది. అంతలా ముందస్తు ప్రణాళికలు ఉన్నప్పటికీ, పుష్కరాల సమయానికి పనులు పూర్తి చేయడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. అలాంటిది ఇప్పుడు పుష్కరాలకు కేవలం 13 నెలలు మాత్రమే సమయం ఉంది. వర్షాకాలం, తుఫానుల ముప్పును పరిగణనలోకి తీసుకుంటే, పనులు చేయడానికి క్షేత్రస్థాయిలో ఆరు నుంచి ఏడు నెలలు మాత్రమే సమయం ఉంది. ఇప్పటికిప్పుడు యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టినా సకాలంలో పూర్తయ్యే పరిస్థితి లేదని భక్తులు ఆందోళన చెందుతున్నారు.
కోటి దాటనున్న భక్తుల రద్దీ
గత 2015 పుష్కరాల్లో అంచనాలను మించి సుమారు 60 లక్షల మంది భక్తులు నరసాపురంలో పుణ్య స్నానాలు ఆచరించారు. జిల్లాల విభజన తర్వాత పశ్చిమ గోదావరి జిల్లాలో పుష్కర స్నానాలకు నరసాపురం ఏకై క పుణ్యక్షేత్రం కావడం, రవాణా సౌకర్యాలు మెరుగుపడటం వంటి కారణాల వల్ల ఈసారి భక్తుల రద్దీ కోటి దాటవచ్చని అంచనా. ఇంతటి భారీ రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ యంత్రాంగం నిధుల కేటాయింపు, ఏర్పాట్లపై కనీస బాధ్యత చూపకపోవడం విమర్శలకు తావిస్తోంది.
శిథిలావస్థలో పుష్కర ఘాట్లు
నరసాపురం పట్టణ పరిధిలో వలంధర్‌రేవు, లలితాంబ ఘాట్, అమరేశ్వర ఘాట్‌లు ప్రధానమైనవి. ముఖ్యంగా చారిత్రక నేపథ్యం ఉన్న వలంధర్‌రేవులో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం ఈ ఘాట్‌లన్నీ శిథిలావస్థకు చేరాయి. 60 అడుగుల వెడల్పు ఉన్న వలంధర్‌రేవును కనీసం 150 అడుగులకు విస్తరించాలనే డిమాండ్ ఉంది. అలాగే, గోదావరి బండ్‌కు వెళ్లే రహదారులు పాడైపోయాయి. గత పుష్కరాల్లో చేసిన పనుల తర్వాత మరమ్మతులు లేకపోవడంతో పరిస్థితి దయనీయంగా మారింది.
అభివృద్ధిని ఒక అవకాశంగా తీసుకోవాలి
గోదావరి పుష్కరాలను నరసాపురం అభివృద్ధికి ఒక మంచి అవకాశంగా భావించి, మున్సిపాలిటీలో సెంట్రల్ లైటింగ్, రహదారుల మెరుగుదలకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. సమయం దగ్గరపడుతున్నా అధికారుల నిర్లక్ష్యం ఇలాగే కొనసాగితే పుష్కరాల నిర్వహణ వైఫల్యం చెందే ప్రమాదం ఉందని పలువురు హెచ్చరిస్తున్నారు.


