భీమవరం: పట్టణ ఇలవేల్పు శ్రీమావుళ్ళమ్మ అమ్మవారికి సుమారు 100 కిలోలతో స్వర్ణ వస్త్రాన్ని త్వరలోనే పూర్తి చేస్తామని, దీనికిగాను ఈనెల 25వ తేదీన ఆలయ ప్రాంగణంలో బంగారు చీర ప్రత్యేక కౌంటర్‌ను ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) తెలిపారు. మంగళవారం ఎమ్మెల్యే కార్యాలయంలో దేవస్థానం స్వర్ణ వస్త్ర నిధి కమిటీ సభ్యులతో స్వర్ణవస్త్రం ప్రాజెక్ట్ బ్రోచర్‌ను ఆయన ఆవిష్కరించారు. అమ్మవారికి ఇప్పటి వరకు సుమారు 50 కిలోల బంగారంతో వివిధ ఆభరణాలు చేయించగా మరొక 23 కిలోల బంగారం దేవస్థానం దగ్గర ఉందన్నారు. స్వర్ణవస్త్రానికి ఇంకా 27 కిలోల బంగారం కావాల్సి ఉందని, దాతల సహకారం అవసరమన్నారు. ఆలయ ఈవో, చైర్మన్ పాల్గొన్నారు.
పెనుగొండ: దొంగరావిపాలెంలో గోదావరి బ్రిడ్జి వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృత దేహం లభ్యమైంది. కొత్త వంతెన 15వ నంబరు పిల్లరు వద్ద మృతదేహం ఉందంటూ గ్రామ వీఆర్వో సమాచారం అందించడంతో పెనుగొండ పోలీసులకు సమాచారం అందించారు. మృతుడికి సుమారు 55 నుంచి 60 ఏళ్ల వయస్సు ఉంటుందని, చిన్నగడుల డిజైన్ పొడవు చేతుల చొక్కా, నలుపు రంగు ఫ్యాంటు ధరించి ఉన్నాడన్నారు. వివరాలు తెలిసిన వారు పెనుగొండ పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని ఎస్‌హెచ్‌ఓ సీహెచ్ రామారెడ్డి కోరారు. సీఐ రాయుడు విజయకుమార్ ఆధ్వర్యంలో పెనుమంట్ర ఎస్సై స్వామి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
పెనుమంట్ర: బట్టలమగుటూరు గ్రామానికి చెందిన జామి రాజు(28) సోమవారం సాయంత్రం తన ఇంట్లో చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మృతుడు రాజు ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశం వెళ్లేందుకు అదే గ్రామానికి చెందిన రాంబాబు అనే వ్యక్తికి రూ. 20 వేలు డబ్బులు చెల్లించి చైన్నె మెడికల్‌కు వెళ్లి అన్‌ఫిట్ కావడంతో తిరిగి వచ్చేశాడు. అనంతరం డబ్బులు తిరిగి ఇవ్వాల్సిందిగా రాంబాబును కోరగా సరైన సమాధానం చెప్పకపోవడంతో మనస్థాపానికి గురై రాజు ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని భావిస్తున్నారు. రాజు తల్లి ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశంలో ఉంటున్నట్లు స్థానికులు తెలిపారు. తండ్రి సూరిబాబు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. జామిరాజు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు.
కొయ్యలగూడెం: గవరవరం గ్రామంలో మంగళవారం పట్టపగలే చోరీ సంభవించింది. వెంకయ్యపాలెం రోడ్డులో రైతు దుగ్గిరాల భాస్కరరావు ఇంట్లో ముగ్గురు దుండగులు ప్రవేశించి 9 కాసుల బంగారం, ఒక కేజీ వెండి అపహరించారు. ఇంటి పక్కనే ఉన్న పొలంలోకి తన భర్తకు టీ ఇవ్వడానికి వెళ్లి వచ్చేలోపే దుండగులు రావడం.. చోరీ చేయడం జరిగిందని భాస్కరరావు భార్య ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాలో చిక్కిన ముగ్గురు అగంతకులు ఎవరనేది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఏలూరు (టూటౌన్): గ్రామీణ తపాలా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఉద్యోగులు స్థానిక సత్రంపాడులోని ఏలూరు సర్కిల్ కార్యాలయం ఎదుట మంగళవారం ధర్నా నిర్వహించారు. దేశవ్యాప్త ఆందోళనల్లో భాగంగా తపాలా ఉద్యోగులు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ జనరల్ సెక్రటరీ మహాదేవయ్యను వెంటనే విధుల్లోకి తీసుకోవాలన్నారు. గ్రామీణ తపాలా ఉద్యోగులకు డిపార్టుమెంట్ ఉద్యోగులతో సమానంగా పెన్షన్ పథకాన్ని కొనసాగించాలని, వారికి కల్పిస్తున్న అన్ని సౌకర్యాలను జీడీఎస్‌లకు కూడా కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఐజీడీఎస్‌యు ఏలూరు డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు పి.దుర్గారావు, ఎస్‌కె బాజీ పాల్గొన్నారు.


