● పంతం నానాజీ ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి
● వైఎస్సార్‌సీపీ గూడెం కన్వీనర్ వడ్డి రఘురాం
తాడేపల్లిగూడెం: అధికారం శాశ్వతం అనే అహంతో వాస్తవ స్థితిని మరిచిపోయి కొందరు జనసేన ఎమ్మెల్యేలు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని వారు ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడాలని తాడేపల్లిగూడెం వైఎస్సార్‌సీపీ కన్వీనర్ వడ్డి రఘురాం హెచ్చరించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జనసేన ఎమ్మెల్యేలు సంస్కారం మరిచి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని ఇది సరైన పద్ధతి కాదన్నారు. వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమానికి ప్రజల నుంచి వచ్చిన అపార స్పందన, కూటమి ప్రభుత్వంపై పెరుగుతున్న వ్యతిరేకతను చూసి అసహనంతో మాట్లాడుతున్నారన్నారు. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు వైఎస్సార్‌సీపీలోని కాపు సామాజిక వర్గ ప్రతినిధులతో ఏర్పాటుచేసిన సమావేశాన్ని ఉద్దేశించి జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ.. కులంలోని వారిని కుక్కలతో పోల్చి మాట్లాడారని, ఆయన కూడా ఈ గుంపులో ఒక సామాజిక వర్గ కుక్కేనన్న విషయాన్ని గుర్తించాల న్నారు. ఆయనకు దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి స్వతంత్రంగా పోటీకి దిగుదామని తోట త్రిమూర్తులు విసిరిన సవాల్‌ను స్వీకరించాలన్నారు.
గూడెం మీడియాకు బొలిశెట్టి క్షమాపణ చెప్పాలి
తాడేపల్లిగూడెం మీడియాకు గూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని వడ్డి డిమాండ్ చేశారు. మీడియాపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్దమన్నారు. వార్తలు రాసినందుకు జర్నలిస్టుల కుటుంబ సభ్యులను కించపరిచేలా మాట్లాడటం అత్యంత హేయమైన చర్య అన్నారు. సభ్య సమాజం తలదించుకొనేలా చేసిన వ్యాఖ్యలను బేషరతుగా ఉపసంహరించుకోవాలన్నారు. ప్రజల తరపున ప్రశ్నించే మీడియా తరపున దాడులు, దూషణలు చేయడం ప్రజాస్వామ్యానికి, మీడియా స్వేచ్ఛకు భంగకరమన్నారు. ఈ వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని మీడియాకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఏలూరు పార్లమెంటు ఇన్‌చార్జి కారుమూరి సునీల్‌ను అరెస్టు చేయడం దారుణమన్నారు. ప్రజాసమస్యలపై పోరాడుతున్న యువ నాయకుడిని లక్ష్యంగా చేసుకొని రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతున్నారన్నారని ఇది సరికాదన్నారు.


