భీమవరం: చంద్రబాబు పాలనపై ప్రజల్లో వ్యక్తమవుతున్న వ్యతిరేకతను డైవర్ట్ చేయడానికి వైఎస్సార్‌సీపీ నాయకులను అక్రమంగా అరెస్ట్ చేయిస్తున్నారని వైఎస్సార్‌సీపీ భీమవరం నియోజకవర్గ సమన్వయకర్త చినమిల్లి వెంకటరాయుడు మండిపడ్డారు. మంగళవారం భీమవరంలోని పార్టీ కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త కారుమూరి సునీల్‌కుమార్ అక్రమ అరెస్ట్ దీనికి నిదర్శనమన్నారు. డ్రగ్స్ పార్టీలో దొరికిన ఏలూరు ఎంపీపై ఎలాంటి చర్యలు తీసుకోలేని ప్రభుత్వం వైఎస్సార్‌సీపీ నాయకులపై అక్రమంగా కేసులు మోపి అరెస్ట్‌లు చేయిస్తున్నారని అన్నారు. వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు అక్రమ కేసులు, అరెస్ట్‌లకు భయపడరని స్పష్టం చేశారు. మాజీమంత్రి కారుమూరి నాగేశ్వరరావును వేధించడానికే ఆయన తనయుడు సునీల్‌కుమార్‌పై కేసులన్నారు. ప్రజలు దీనిని గ్రహించి త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీలకు తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు గాదిరాజు రామరాజు, మాజీ అధ్యక్షుడు కోడే యుగంధర్ మాట్లాడుతూ రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం అమలుచేస్తున్నారన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అక్రమాలు, అన్యాయాలను ప్రశ్నించడం వల్లే వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెడుతున్నారని దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. సునీల్‌కుమార్‌పై అక్రమంగా పెట్టిన కేసులు ఎట్టి పరిస్థితిలోను నిలబడవన్నారు. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ప్రజల సమస్యలు పరిష్కారం, అభివృద్దిపై దృష్టిపెట్టాలని హితవు చెప్పారు.


