అదుపు తప్పి చెట్టును ఢీకొన్న బస్సు | - | Sakshi
Sakshi News home page

అదుపు తప్పి చెట్టును ఢీకొన్న బస్సు

Jun 23 2026 2:10 AM | Updated on Jun 23 2026 2:10 AM

డ్రైవర్‌కు తీవ్రగాయాలు

నూజివీడు నుంచి శ్రీశైలం వెళ్తుండగా ఘటన

ప్రయాణికులకు తప్పిన ప్రమాదం

నూజివీడు: నూజివీడు డిపోకు చెందిన శ్రీశైలం వెళ్లే బస్సు ఆదివారం అర్ధరాత్రి దాటిన తరువాత 1.30 గంటల సమయంలో ప్రమాదానికి గురైంది. మార్కాపురం జిల్లా కుంట సమీపంలో బస్సు అదుపుతప్పి చెట్టును ఢీకొంది. ఈ ఘటనలో డ్రైవర్‌ రాంబాబుకి తీవ్ర గాయాలయ్యాయి. అదృష్టవశాత్తూ ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. తీవ్రంగా గాయపడిన డ్రైవర్‌ను మార్కాపురం ఆసుపత్రికి, అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం ఒంగోలు ఆసుపత్రికి తరలించారు.

విశ్రాంతి లేకుండా డ్యూటీలు

చేయించడమే కారణమా?

శ్రీశైలం వెళ్లే బస్సు ప్రమాదానికి గురికావడం వెనుక యాజమాన్యం కార్మికులపై చేస్తున్న ఒత్తిడి, నిర్లక్ష్యమే అసలు కారణమనే విమర్శలు కార్మికుల్లో నుంచి వ్యక్తమవుతున్నాయి. దీనికి తోడు సరిపడా విశ్రాంతి లేకుండానే డ్యూటీలు వేయడం వల్లనే ఈ ప్రమాదం జరగడానికి బలమైన కారణమని పేర్కొంటున్నారు. తీవ్రంగా గాయపడిన డ్రైవర్‌ కే రామకృష్ణ ఆదివారం మధ్యాహ్నం 2గంటలకు నూజివీడు–యర్రగొండపాలెం సర్వీసు డ్యూటీ చేసి డ్యూటీ దిగాడు. అతనిని మరలా వెంటనే రాత్రి 8 గంటలకు సూపర్‌ లగ్జరీ సర్వీసుకు డ్యూటీ వేసి శ్రీశైలం సర్వీసుకు పంపించారు. దీంతో సరిపడా విశ్రాంతి లేక ప్రమాదం జరిగిందనే విషయం ప్రతి ఒక్కరికి అర్థమవుతోంది. ఇలా సరిపడా విశ్రాంతి లేకుండా డ్రైవర్లను డ్యూటీకి పంపడమంటే ప్రయాణికుల ప్రాణాలను సైతం రిస్క్‌లో పెట్టినట్లేనని ఆర్టీసీ కార్మికులు పేర్కొంటున్నారు. నూజివీడు డిపోలో డ్రైవర్లకు సరిపడా విశ్రాంతి ఇవ్వకుండా 16గంటల నుంచి 18గంటల వరకు డ్యూటీ చేయిస్తున్నారని కార్మికులు ఎప్పటి నుంచో ఆందోళనలు చేస్తున్నా యాజమాన్యం పట్టించుకోవడం లేదు. ఇటీవల కాలంలో నాలుగు యాక్సిడెంట్‌లు చోటుచేసుకోవడం గమనార్హం.

ఆ డ్రైవర్‌ను దూరప్రాంతాలకు ఎలా పంపుతారు?

ప్రమాదానికి గురైన బస్సు డ్రైవర్‌ కే రామకృష్ణ గతంలో భీమవరం డిపోలో పనిచేస్తూ అక్కడ ప్రమాదం చేసి పనిష్మెంట్‌పై నూజివీడు డిపోకు బదిలీ అయ్యారు. అలాంటి డ్రైవర్‌ను యాజమాన్యం కేవలం పల్లెవెలుగు సర్వీసులకు మాత్రమే పంపాల్సి ఉండగా ఇక్కడ మాత్రం హైదరాబాద్‌, శ్రీశైలం వంటి దూర ప్రాంత సర్వీసులకు పంపడం గమనార్హం. శ్రీశైలంకు కండక్టర్‌ సర్వీసులను ఏర్పాటు చేయమని కార్మికసంఘాల నాయకులు పదేపదే యాజమాన్యానికి చెబుతున్నా పట్టించుకోవడం లేదు. ఆర్టీసీ లాంటి ప్రజా రవాణా సంస్థల్లో ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు కేవలం డ్రైవర్‌ తప్పు అనడం కంటే, దాని వెనుక ఉన్న అసలు కారణాలను కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement