కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపులో జాప్యం | - | Sakshi
Sakshi News home page

కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపులో జాప్యం

Jun 23 2026 2:10 AM | Updated on Jun 23 2026 2:10 AM

నూజివీడు: కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపులో ప్రభుత్వం చేస్తున్న తీవ్ర జాప్యం కారణంగా కాంట్రాక్టర్లు తీవ్ర మానసిక వేదనకు గురై బలవన్మరణాలకు పాల్పడే ప్రమాదం కూడా పొంచి ఉందని నవ్యాంధ్ర కాంట్రాక్టర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర జనరల్‌ సెక్రెటరీ కోనేరు శ్రీనివాస ప్రసాద్‌ అన్నారు. నూజివీడులో గుండెపోటుతో మృతి చెందిన కాంట్రాక్టర్‌ చలసాని సురేష్‌కుమార్‌(నాని) కుటుంబ సభ్యులను సోమవారం అసోసియేషన్‌ నాయకులు పరామర్శించారు. అనంతరం వారు మాట్లాడుతూ గత రెండేళ్లుగా చేసిన పనులకు బిల్లులు చెల్లించకపోవడం వల్ల కాంట్రాక్టర్లందరూ తీవ్రమైన ఆర్థిక, మానసిక ఒత్తిడికి గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలోని అర్‌డబ్ల్యూఎస్‌ కాంట్రాక్టర్లు టైం బాంబుల్లా బతుకుతున్నారని, ప్రత్యక్షంగా 750 మంది కాంట్రాక్టర్లు, వారిపై ఆధారపడిన 15వేల మందికి చెందిన కుటుంబాలు తీవ్ర ఒత్తిడిలో ఉన్నాయన్నారు. గత రెండేళ్లుగా జలజీవన్‌ మిషన్‌ బిల్లులు చెల్లించకపోవడం వల్ల కాంట్రాక్టర్ల ఆత్మస్థైర్యం పూర్తిగా దెబ్బతిందని, వ్యవస్థపై దాదాపు నమ్మకాన్ని కూడా కోల్పోయామన్నారు. గతంలో ప్రభుత్వ కాంట్రాక్టర్ల పరిస్థితి చూస్తే ప్రభుత్వం నిధులు విడుదల చేసినప్పుడల్లా చెల్లింపులు జరుగుతాయనే భరోసా ఉండేదన్నారు. వ్యవస్థను కార్పొరేట్లకు అనుకూలంగా మార్చి కాంట్రాక్టర్ల వెన్ను విరిచేస్తున్నారన్నారు. రుణాల చెల్లింపుపై ఒత్తిడి పెరగడంతో కాంట్రాక్టర్‌లు బలవన్మరణాలకు పాల్పడే ప్రమాదం పొంచి ఉందన్నారు. మరోవైపు తీవ్ర ఒత్తిడికి గురై చలసాని సురేష్‌ గుండెపోటుతో ఆసుపత్రి కి తీసుకువెళ్లే సమయం కూడా లేకుండా మృతి చెందడం బాధాకరమన్నారు. ఈ నేపథ్యంలో మృతి చెందిన కాంట్రాక్టర్‌ కుటుంబానికి రావాలసిన బిల్లులను తక్షణం చెల్లించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, తమ అసోసియేషన్‌ సైతం వారికి అండగా నిలుస్తుందన్నారు. ఈ సమావేశంలో సెక్రటరీ ఎన్‌వీఆర్‌కే రాజు, కోశాధికారి కే బాలకృష్ణ, సంయుక్త కార్యదర్శి ఏ నరసింహా, స్థానిక కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement