● చెట్టును ఢీకొన్న కారు ● ఒకరి మృతి.. ఐదుగురికి గాయాలు
ఉంగుటూరు: చేబ్రోలు పరిధిలో ఆదివారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల సమాచారం ప్రకారం.. గణపవరానికి చెందిన ఫణీంద్ర (26)తో పాటు నిడమర్రు గ్రామానికి చెందిన వేగిరెడ్డి షణ్ముఖ తేజ, వేగిరెడ్డి హేమంత్ ఫణిచంద్ర, కట్టుబోయిన వెంకన్న, ప్రవీణ్, మంగరాజు కారులో కై కలూరు మండలం కొల్లేటికోట పెద్దింట్లమ్మ అమ్మవారి దర్శనానికి వెళ్లారు. దర్శనం ముగించుకుని తిరిగి స్తుండగా, చేబ్రోలు ఆంజనేయస్వామి గుడి సమీపంలో కారు అదుపు తప్పి రహదారి పక్కనే ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న ఫణీంద్ర తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. కారులో ఉన్న మిగిలిన ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే జాతీయ రహదారి అంబులెన్స్, 108 వాహనాల ద్వారా క్షతగాత్రులను తాడేపల్లిగూడెం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. చేబ్రోలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


