భీమవరం : ఇంజనీరింగ్ చాలా మంది విద్యార్థుల కల. పేద విద్యార్థుల ఉన్నత చదువు లక్ష్యంగా దివంగత సీఎం వైఎస్సార్ ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారు. దీంతో రాష్ట్రంలో లక్షలాది మంది ఇంజనీరింగ్ విద్యను అభ్యసించి ఉన్నత కొలువులు సాధించారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పూర్తిస్థాయిలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను అందించి పేద విద్యార్థుల చదువులకు ఎంతో ఊతమిచ్చారు. అయితే రెండేళ్లుగా పరిస్థితి భిన్నంగా ఉంది. కూటమి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు సకాలంలో విడుదల చేయకపోవడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. విద్యార్థులు ఫీజులు చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామంటూ కళాశాల యాజమాన్యాలు ఆంక్షలు విధించడంతో ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇంజనీరింగ్ విద్య అంటేనే భయపడే పరిస్థితి నెలకొంది.
16 కాలేజీలు.. 8,400 సీట్లు
పశ్చిమగోదావరి జిల్లాలో 9 కళాశాలల్లో 5,200 సీట్లు, ఏలూరు జిల్లాలో 7 కళాశాలల్లో 3,200 సీట్లు ఉన్నాయి. మొత్తంగా 16 ఇంజనీరింగ్ కాలేజీల్లో 8,400 సీట్లు ఉన్నాయి. ఇంజనీరింగ్, ఫార్మసీ, వ్యవసాయ కోర్సుల్లో ప్రవేశాల కోసం గత నెల 12 నుంచి 20 వరకు జరిగిన ఏపీఈఏపీసెట్ పరీక్షలకు సుమారు 20 వేల మంది విద్యార్థులు హాజరయ్యారు. సోమవారం ఫలితాలు విడుదలవుతాయనే వార్తలతో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఉత్కంఠ నెలకొంది.
మేనేజ్‌మెంట్ కోటాలో..
జిల్లాలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో సీఎస్‌ఈ, ఈసీఈలోని పలు బ్రాంచ్‌ల సీట్లకు డిమాండ్ ఎక్కువగా ఉంది. దీంతో మేనేజ్‌మెంట్ కోటాలో రూ.3 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ఫీజులు ఉన్నాయి. కొందరు తల్లిదండ్రులు ఫలితాలు ఎలా ఉన్నా ముందుగానే పేరొందిన కళాశాలలో సీటు రిజర్వ్ చేసుకోవడంతో మేనేజ్‌మెంట్ కోటా సీట్ల ధరలకు రెక్కలొచ్చాయి. భీమవరం, ఏలూరు, నరసాపురం, తాడేపల్లిగూడెంలో ప్రముఖ కాలేజీలు ఉన్నాయి. కొన్ని కళాశాలల్లో బాలికలకు వసతి, కట్టుదిట్టమైన రక్షణ ఉండటంతో రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు చెందినవారు ఆసక్తి చూపుతున్నారు.
సకాలంలో అందని ఫీజు రీయింబర్స్‌మెంట్
ఇంజనీరింగ్ చదువుకు వెనుకడుగు!
ఉమ్మడి జిల్లాలో 16 కళాశాలలు.. 8,400 సీట్లు


