మంచి విత్తనాలతోనే నారు పోయాలి
బుట్టాయగూడెం: తొలకరి వర్షాలు ప్రారంభమయ్యాయి. రైతులు వ్యవసాయ పనులకు సిద్ధమవుతున్నారు. విత్తనాలు కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే, నాణ్యమైన విత్తనాల ఎంపికలో రైతులు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. కల్తీ విత్తనాల విషయంలో జాగ్రత్త వహించాలని, విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు విక్రయించే డీలర్లు ఎరువుల నియంత్రణ చట్టం–1985 ప్రకారం నిబంధనలను పాటించాలని హెచ్చరిస్తున్నారు.
పాటించాల్సిన జాగ్రత్తలు
● వ్యవసాయ శాఖ నుంచి లైసెన్స్ పొందిన డీలర్ల వద్ద, గుర్తింపు పొందిన సంస్థల వద్ద మాత్రమే విత్తనాలు కొనుగోలు చేయాలి.
● సీలు వేసి, ధ్రువీకరణ పత్రం కలిగిన విత్తన బస్తాలనే ఎంచుకోవాలి.
● విత్తనాల సంచిపై ఉన్న రకం, ల్యాబ్ నంబర్, గడువు తేదీ వంటి వివరాలను తప్పనిసరిగా గమనించాలి.
● కొనుగోలు చేసిన తర్వాత డీలర్ సంతకం ఉన్న ఖచ్చితమైన బిల్లును తీసుకోవడం మర్చిపోకూడదు.
● హైబ్రీడ్ విత్తనాల విషయంలో వాటి రకం, స్వచ్ఛత, మొలకెత్తే సామర్థ్యం, జన్యు నాణ్యత వంటి వివరాలను పరిశీలించాలి.
● పంట మొలకెత్తే దశలో గానీ, పూత దశలో గానీ ఏదైనా లోపం కనిపిస్తే వెంటనే స్థానిక వ్యవసాయాధికారులను లేదా సిబ్బందిని సంప్రదించాలి.
మొలక శాతం పరీక్షించే విధానం
రైతులు విత్తనం కొనుగోలు చేసిన వెంటనే మొలక పరీక్ష చేసుకోవాలి. కొనుగోలు చేసిన విత్తన సంచి నుంచి 100 గింజలను తీసుకుని వాటిని 24 గంటలపాటు నీటిలో నానబెట్టాలి. అనంతరం ఆ గింజలను ఒక గుడ్డలో కట్టి, గాలి, వెలుతురు తగలని ప్రదేశంలో ఉంచాలి. మరో 24 గంటల తర్వాత చూస్తే, 100 గింజలకు కనీసం 75 గింజలు మొలకెత్తాలి. 75 శాతం కంటే ఎక్కువ మొలక శాతం ఉంటేనే ఆ విత్తనాలు నాణ్యమైనవని నిర్ధారించుకుని నారుమడి సిద్ధం చేసుకోవాలి.
గడువు దాటితే కొనుగోలు చేయొద్దు
కొనుగోలు చేసే విత్తన ప్యాకెట్, సీసా డబ్బాపై సీలు ఉందా? లేదా? అనేది నిర్థారించుకోవాలి. అరువు పద్ధతిలో విత్తనాలు కొనుగోలు చేసినప్పటికీ బిల్లు తప్పనిసరిగా తీసుకోవాలి. మొలకెత్తే దశ, పూత దశలో పంటలో లోపం కనిపిస్తే వెంటనే వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించాలి.
రైతులకు వ్యవసాయాధికారుల సూచనలు
రైతులు సొంతంగా తయారు చేసిన విత్తనాలు నారు పోయడానికి శ్రేయస్కరం. ఒక వేళ కొనుగోలు చేస్తే మంచి విత్తనాలను మాత్రమే ఎంపిక చేసి కొనుగోలు చేయాలి. నారుపోసే ముందు వాటి మొలక శాతం గుర్తించి నారు పోయాలి. నకిలీ విత్తనాలను కొనుగోలు చేసి మోసపోవద్దు. విత్తనాల కొనుగోలులో ఎలాంటి సమస్యలు ఉన్నా వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించాలి.
–పీజీ బుచ్చిబాబు, సహాయ వ్యవసాయ సంచాలకుడు, కేఆర్‌పురం, బుట్టాయగూడెం మండలం


