కాళ్ల: కాళ్ల మండలం కాళ్ళకూరు గ్రామంలో వెలసిన స్వయంభూ శ్రీ వెంకటేశ్వరస్వామి దేవస్థానంలో మాడవీధుల అభివృద్ధి పనులకు భక్తులు విరాళం అందించినట్లు దేవస్థానం చైర్మన్ అడ్డాల శివరామరాజు, ఈవో మోకా అరుణ్‌కుమార్ ఆదివారం తెలిపారు. జక్కరం గ్రామానికి చెందిన సాగిరాజు సుబ్బరాజు, వరలక్ష్మి దంపతుల కుమారుడు అప్పలరాజు (సింగపూర్ అప్పన్న), లక్ష్మీరూప దంపతులు, మనవళ్ళు దినేష్ వర్మ, అక్షిత్ రిషేంద్రవర్మ, సాగిరాజు శ్రీనివాసరాజు, రాధిక దంపతులు, మనవరాలు జాహ్నవి సమిహిత కలిసి రూ.5,01,116లు దేవాలయం చుట్టూ మాడవీధుల విస్తరణలో భాగంగా స్థలం కొనుగోలు నిమిత్తం విరాళంగా అందించినట్లు ఈవో తెలిపారు. ఈ సందర్భంగా దాతలకు ప్రత్యేక దర్శనం కల్పించి స్వామివారి ప్రతిమతో సత్కరించారు.
బుట్టాయగూడెం: భక్తుల కోర్కెలు తీర్చే తల్లిగా, వరాలిచ్చే అమ్మగా, గిరిజనుల ఆరాధ్య దేవతగా బుట్టాయగూడెం మండలం కామవరం సమీపంలో అటవీ ప్రాంతంలో కొలువై ఉన్న గుబ్బల మంగమ్మ గుడికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ప్రత్యేక బస్సుల్లో తెల్లవారుజాము నుంచే భక్తులు అమ్మవారి సన్నిధికి చేరుకున్నారు. అనంతరం ధూపదీప నైవేద్యాలతో అమ్మవారికి పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఉదయం 7 గంటల సమయంలో ఆకాశంలో నల్లని మబ్బులు కమ్మడంతో వర్షం కురుస్తుందేమోనని భక్తులు ఆందోళన చెందారు. అయితే కొద్దిపాటి చినుకులు మాత్రమే పడి వర్షం ఆగిపోవడంతో పాటు వాతావరణం చల్లగా మారడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
వీరవాసరం: వీరవాసరం మండలం కొణితివాడ గవరపేట గ్రామంలో ఆదివారం కన్నతల్లికి కుమార్తెలు తలకొరివి పెట్టారు. మళ్ల కృష్ణవేణి– మళ్ల సాంబమూర్తి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. 2015 అక్టోబర్ 20న తండ్రి సాంబమూర్తి మరణించగా ఆయనకు కుమార్తెలు తలకొరివి పెట్టి తండ్రి మీద ఉన్న ప్రేమ, అనురాగాలను చాటుకున్నారు. ఆదివారం తల్లి కృష్ణవేణి (70) మృతి చెందారు. ఆమెకు పెద్ద కుమార్తె అరుణ, చిన్న కుమార్తె విజయ తలకొరివి పెట్టి కొడుకులు లేని లోటును తీర్చారు. కొడుకులు లేరని ఏ రోజూ మా తల్లిదండ్రులు బాధపడకుండా చూసుకున్నాం అని కుమార్తెలు తెలిపారు. కొడుకులకు ఏ విధంగానూ తీసిపోమని నిరూపించుకున్నారని గ్రామస్తులు వారిని అభినందించారు.


