తాడేపల్లిగూడెం: చేపలు, రొయ్యల్లో వస్తున్న మార్పుల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని, లక్షణాలు కనిపించిన వెంటనే తగు చర్యలు తీసుకోవాలని వెంకట్రామన్నగూడెం కేవీకేలో నేషనల్ ఫిషరీస్ డెవలప్‌మెంటు బోర్డు సహకారంతో జరుగుతున్న శిక్షణా కార్యక్రమంలో ఆదివారం వక్తలు తెలిపారు. వ్యాధుల నిర్ధారణకు నమూనాల సేకరణ, కణజాల పరీక్షల ద్వారా వ్యాఽధి తీవ్రత, రోగనిరోధక సంబంధ పరీక్షలు, వ్యాధి కారకాలను గుర్తించడానికి ఆధునిక పద్ధతులను అవలంభించాలన్నారు. సూక్ష్మంగా వ్యాధులను గుర్తించడానికి ఆధునిక సాంకేతిక పరికరాల గురించి సమాచారం తెలిపారు. చేపల్లో పోషకాహార లోప వ్యాధులు, సరైన ఆహారం అందక చేపలు, రొయ్యల్లో ఎలాంటి వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయో విశదీకరించారు. మాలిక్యులర్ డయోగ్నోస్టిక్స్ టూల్స్ వినియోగం, పీసీఆర్, ఆర్‌టీపీసీఆర్, ల్యాంప్ ఎనాలిసిస్, వ్యాధి కారకాల డీఎన్‌ఏను గుర్తించే ప్రాధమిక పద్ధతి, ఆర్‌ఎన్‌ఏ వైరస్‌లను గుర్తించడానికి ఉపయోగించాల్సిన సాంకేతికత గురించి వివరించారు. కృషి విజ్ఞానకేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ దేవీవరప్రసాదరెడ్డి ఆధ్వర్యంలో సాగిన శిక్షణా కార్యక్రమంలో విషయాలను ఉండి ఫిషరీస్ రీసెర్చ్ స్టేషన్‌కు చెందిన శాస్త్రవేత్త డాక్టర్ శాస్త్రి, డాక్టర్ ధీరన్ వివరించారు.


