భీమవరం : పోలీసుల వేధింపులతో మృతిచెందిన విజయవాడ కృష్ణలంకకు చెందిన కాపు యువకుడు గాదె సాయికృష్ణ కుటుంబసభ్యులను కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు, వైఎస్సార్‌సీపీ భీమవరం నియోజకవర్గ సమన్వయకర్త చినమిల్లి వెంకటరాయుడు శనివారం పరామర్శించారు. కృష్ణలంకలోని సాయికృష్ణ నివాసానికి వెళ్లి మృతుడు తల్లి విజయలక్ష్మి, ఇతర కుటుంబసభ్యులను ఓదార్చారు. అనంతరం వెంకటరాయుడు మాట్లాడుతు కూటమి ప్రభుత్వ హయాంలో రెడ్‌బుక్ రాజ్యాంగం అమలవుతున్నందున అన్నివర్గాల ప్రజలకు రక్షణ కరువైందన్నారు. సాయికృష్ణ మృతిపై సీబీఐతో విచారణ చేసి నిదింతులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
భీమవరం (ప్రకాశంచౌక్) : రెవెన్యూ శాఖ అధికారులు, సిబ్బంది రెవెన్యూ చట్టాలపై పూర్తి అవగాహన కలిగి ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి సూచించారు. రెవెన్యూ డే సందర్భంగా శనివారం కలెక్టరేట్ పీజీఆర్‌ఎస్ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రెవెన్యూ సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేసిన జాయింట్ కలెక్టర్, రెవెన్యూ శాఖలో ప్రతి ఫైలు ఒక జీవితంతో ముడిపడి ఉంటుందని, అందువల్ల ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి జాగ్రత్తగా పరిష్కరించాలని అన్నారు. ఉద్యోగులందరూ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఈ సందర్భంగా నరసాపురం కలెక్టర్ కార్యాలయంలో ఏవోగా పనిచేస్తున్న పెద్దిరాజు, కలెక్టరేట్‌లో ఎలక్షన్ డీటీగా పనిచేస్తున్న శ్రీనివాస్, ల్యాండ్ సూపరింటెండెంట్ భాను, ఆఫీస్ సబార్డినేట్ భారతిని జాయింట్ కలెక్టర్ దుశ్శాలువాలతో సత్కరించారు.
భీమవరం (ప్రకాశంచౌక్) : భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) –2026 కార్యక్రమం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోందని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని ఓటర్ల వివరాల సేకరణ, పరిశీలన, సవరణల కోసం ఈ నెల 15వ తేదీ నుంచి బీఎల్‌ఓలు ఇంటింటి సందర్శనలు నిర్వహిస్తున్నారని వెల్లడించారు. జిల్లాలో నియమితులైన బీఎల్‌ఓలందరికీ ప్రత్యేక శిక్షణ అందించి, ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దీంతో ఇప్పటివరకు 30.20 శాతం ఫారాల పంపిణీ పూర్తయిందని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఓటర్ల వివరాల సేకరణ, ధ్రువీకరణ, సవరణ ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు చెప్పారు.


