అరెస్ట్‌ కుట్రలో భాగమే | - | Sakshi
Sakshi News home page

అరెస్ట్‌ కుట్రలో భాగమే

Jun 21 2026 8:10 AM | Updated on Jun 21 2026 8:10 AM

అరెస్ట్‌ కుట్రలో భాగమే

తణుకు అర్బన్‌: బీసీలను అణగదొక్కడమే లక్ష్యంగా చంద్రబాబు సర్కారు కుట్రలు చేస్తుందని వైఎస్సార్‌సీపీ బీసీసెల్‌ రాష్ట్ర కార్యదర్శి చింతపల్లి గురుప్రసాద్‌ అన్నారు. తణుకు పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏలూరు పార్లమెంట్‌ ఇన్‌చార్జ్‌ కారుమూరి సునీల్‌కుమార్‌ అక్రమ అరెస్టు బాధాకరమని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఎంతో పారదర్శకంగా అమలుచేసిన మద్యం పాలసీలో భాగంగా రవాణాకు సంబంధించి ఢిల్లీకి చెందిన సిగ్మా సంస్థ సుదర్శన్‌ కన్‌స్ట్రక్షన్స్‌ అనే కంపెనీకి ఇవ్వగా వారికి నిబంధనల ప్రకారం సునీల్‌కుమార్‌ కంపెనీ వాహనాలను మాత్రమే సరఫరా చేసినట్లు చెప్పారు. ఆయా సంస్థలను వదిలేసి సునీల్‌కుమార్‌పై కేసు నమోదుచేసి జైలుకు పంపించడం దుర్మార్గమని అన్నారు. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కూటమి ప్రభుత్వ అరాచకాలు ఎండగడుతున్నారనే ఆయన కుమారుడిని జైలుకు పంపించారని మండిపడ్డారు. బీసీలపై ఇదే పరిస్థితి కొనసాగితే రాబోయే రోజుల్లో ఆందోళన బాట పడతామని చెప్పారు. డ్రగ్స్‌ తీసుకుని పట్టుబడిన ఎంపీపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా కాలం గడిపేశారని, జనసేన అరవ శ్రీధర్‌ మహిళపై దాడిచేసినా, ఎమ్మెల్యే చింతమనేని తప్పతాగి న్యాయవాది ఇంటిపైకి దాడికి దిగినా కేసులు నమోదుచేయలేదని విమర్శించారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు మారిశెట్టి శేషగిరి, పట్టణ మహిళాధ్యక్షురాలు నూకల కనకదుర్గ, బీసీ నాయకులు బిరుదుకోట చింతన్న, కొప్పిశెట్టి దుర్గాప్రసాద్‌, యారబాటి రామకృష్ణ, గెద్దా శ్రీకాంత్‌, సాక్షి గోపాలరావు, కాకరపర్తి ఆంజనేయులు, నమ్మి ధనలక్ష్మి, పైడి సాయిసూర్య పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement