భీమవరం: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటినుంచి వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలను వేధించడమే లక్ష్యంగా పనిచేస్తుందని వైఎస్సార్‌సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు చిగురుపాటి సందీప్ తీవ్రంగా విమర్శించారు. శుక్రవారం భీమవరంలో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కృష్ణలంకలో యువకుడి హత్యను పక్కదోవ పట్టించడానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కారుమూరి సునీల్ అక్రమ అరెస్ట్‌ను తెరపైకి తెచ్చారని ఆరోపించారు. ఎలాంటి అవినీతి మరకలు లేని సునీల్‌ను మద్యం కేసు బూచిగా చూపి అరెస్ట్ చేయడం దారుణమన్నారు. ఎంపీ పుట్టా మహేష్ డ్రగ్స్ కేసులో పట్టుబడితే ఎలాంటి చర్యలు తీసుకోని రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి ఆధారాలు లేని మద్యం కేసులో సునీల్‌ను అరెస్ట్ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఇలాంటి చౌకబారు అక్రమ కేసులు, అరెస్ట్‌లతో వైఎస్సార్‌సీపీని అడ్డుకోలేరని చెప్పారు.


