విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం | - | Sakshi
Sakshi News home page

విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం

Jun 20 2026 12:30 PM | Updated on Jun 20 2026 12:30 PM

విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : జిల్లాలో నూతన కొత్త సంవత్సరం ప్రారంభమైంది. విద్యార్థులు ఉత్సాహంగా బడులకు వెళుతున్నారు. ఒక పక్క ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నా తమ బిడ్డల భవిష్యత్‌ కోసం తల్లిదండ్రులు కష్టమైనా బడులకు పంపుతున్నారు. ఎక్కువ మంది విద్యార్థులు పాఠశాలల యాజమాన్యాలు నడుపుతున్న బస్సులపై వెళ్తున్నారు. బస్సులైతే భద్రంగా ఉంటుందనే నమ్మకంతో బస్సుల్లోనే తమ బిడ్డలను పంపుతున్నారు. పాఠశాలల యాజమాన్యాలు మాత్రం కేవలం వ్యాపార దృక్పథంతో వ్యవహరిస్తూ కనీసం ప్రమాణాలు లేకుండా బస్సులను నిర్వహిస్తున్నాయనే విమర్శలు వస్తున్నాయి.

పూర్తికాని బస్సుల ఫిట్‌నెస్‌

ఏ వాహనమైనా రహదారిపై తిరగాలంటే రవాణా శాఖ ప్రమాణాలు పాటించాలి. రవాణా శాఖ నిబంధనలను అనుసరించాలి. సదరు బస్సులు రోడ్డుపై తిరడగానికి అనువుగా ఉందని ఏటా రవాణా అధికారుల అనుమతులు పొందాల్సి ఉంటుంది. ముఖ్యంగా విద్యా సంస్థల బస్సులు విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందుగానే ఇలాంటి అనుమతులన్నీ పొంది సిద్ధంగా ఉండాలి. విద్యా సంవత్సరం ప్రారంభమై వారం రోజులు గడుస్తున్నా ఇప్పటికీ కొన్ని బస్సులు సదరు అనుమతులు పొందలేదు. అయినప్పటికీ ఆయా విద్యా సంస్థలు బస్సులను తిప్పుతూ విద్యార్థులను పాఠశాలకు, వారి ఇళ్ళకు రవాణా చేస్తున్నాయి. దీనిపై ఇప్పటికే రవాణా అధికారులు విద్యా సంస్థల యాజమాన్యాలతో అవగాహన సమావేశాలు నిర్వహించి ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లు పొందాలని సూచించారు.

జిల్లాలో 1,242 విద్యాసంస్థల బస్సులు

జిల్లా వ్యాప్తంగా విద్యా సంస్థలకు చెందిన 1,242 బస్సులను విద్యార్థులను తిప్పడానికి వినియోగిస్తున్నారు. ఈ విద్యా సంవత్సరం వాటికి ఫిట్‌నెస్‌ అనుమతులు పొందాల్సి ఉండగా విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందు వాటిలో సగంలోపు బస్సులకు మాత్రమే ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లు పొందారు. ఈ మధ్య కాలంలో రవాణా శాఖ అధికారులు ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించి ఫిట్‌నెస్‌ లేకుండా, ఇతర నిబంధనలు పాటించకుండా తిప్పుతున్న సుమారు 50కు పైగా బస్సులపై కేసులు నమోదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా తిప్పే బస్సుల యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటామని చేసిన హెచ్చరికల నేపథ్యంలో విద్యా సంస్థల యాజమాన్యాలు తప్పనిసరి పరిస్థితిలో అనుమతులు పొందడానికి చర్యలు చేపట్టారు. ఈ మేరకు ఇంత వరకూ 1171 బస్సులకు ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లు పొందారు. మరో 71 బస్సులకు ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లు పొందలేదు. దీనితో మిగిలిన వాటికి కూడా ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లు పొందాలని విద్యా సంస్థల యాజమాన్యాలకు నోటీసులు పంపారు.

డ్యాష్‌ బోర్డు కెమెరాలు అమర్చాలని ఆదేశాలు

ఇదిలా ఉండగా విద్యార్థులకు సురక్షితమైన ప్రయాణ సౌకర్యం కోసం, బస్సు డ్రైవర్ల అజాగ్రత్తలు గమనించడం కోసం, వేగ నియంత్రణను నిరంతరం పర్యవేక్షించడం కోసం ఈ ఏడాది కొత్తగా విద్యా సంస్థల బస్సులకు డాష్‌బోర్డు కెమెరాలు అమర్చాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. జిల్లా ఎస్పీ సూచనల మేరకు రవాణా శాఖ అధికారులు ఇప్పటికే విద్యా సంస్థల యాజమాన్య ప్రతినిధులతో సమావేశం నిర్వహించి డ్యాష్‌ బోర్డు కెమెరాల ఏర్పాటుపై అవగాహన కలిగించారు. ఈ డాష్‌ బోర్డు కెమెరాల ద్వారా రికార్డయ్యే వీడియోలను అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించి చర్యలు తీసుకోవడానికి జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక బృందాన్ని డా ఏర్పాటు చేశారు. జిల్లాలోని పెద్ద విద్యా సంస్థలకు సుమారు 20 నుంచి 30 బస్సులు ఉండగా వాటన్నింటిలో డ్యాష్‌ బోర్డు కెమెరాలు అమర్చడం ఖర్చుతో కూడుకున్న అంశం కావడంతో ఈ ప్రక్రియ మందకొడిగా సాగుతోంది.

ఇప్పటికీ పూర్తికాని విద్యాసంస్థల బస్సుల ఫిట్‌నెస్‌ పరీక్షలు

జిల్లావ్యాప్తంగా 1,242 విద్యాసంస్థల బస్సులు

బస్సులకు డ్యాష్‌ బోర్డు కెమెరాలు అమర్చాలని ఆదేశాలు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement